గతేడాది ఫిబ్రవరి 14న పుల్వామా ఘటనలో ప్రాణాలర్పించిన సీఆర్పీఎఫ్ జవాన్ల జ్ఞాపకార్థం...జమ్ముకశ్మీర్లో స్మారక చిహ్నానికి నేడు శంకుస్థాపన చేయనున్నారు అధికారులు. ఉగ్రదాడిలో 40 మంది వీరజవాన్లు ప్రాణాలు కోల్పోయి.. ఏడాది అయిన సందర్భంగా.. ఘటన జరిగిన ప్రాంతంలో నివాళులర్పించనున్నట్లు సీఆర్పీఎఫ్ అదనపు డైరక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ తెలిపారు.
ఘటనా ప్రదేశంలోనే ఈ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసిన ఆయన.. 40 మంది అమరుల పేర్లు, ఫొటోలతో పాటు సేవా-నిష్ఠ అనే నినాదాన్ని చిహ్నంలో పొందుపర్చినట్లు వెల్లడించారు.
" గతేడాది జరిగిన ఉగ్రదాడి ఓ దురదృష్టకర ఘటన. ఆ దుర్ఘటన నుంచి మేము ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాం. మా విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నాము, అయితే పుల్వామా ఉగ్రదాడి తర్వాత మా అప్రమత్తత మరింత పెరిగింది. 40 మంది జవాన్ల అత్యున్నత త్యాగాలు దేశంలో శత్రువులను నిర్మూలించాలనే మా సంకల్పాన్ని మరింత పెంచింది."
-జుల్ఫికర్ హసన్, సీఆర్పీఎఫ్ అదనపు డైరక్టర్ జనరల్
ఇదీ చూడండి: మోదీపై అభ్యంతరకర పోస్టు.. వెంకయ్య నాయుడు ఫైర్