జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా అంశంపై త్వరలో నిర్ణయం ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ప్రత్యేక హోదాతో చెలగాటమాడవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి హితవు పలికారు.
"కొద్ది రోజులుగా కశ్మీర్ పరిస్థితుల్లో మార్పు వస్తోంది. ఇక్కడ ఏదో జరగబోతుందనే వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఏమీ జరగడం లేదని ప్రభుత్వం, గవర్నర్ ప్రతిసారి చెప్తున్నారు. యాత్రికులను వెనక్కి పంపించాలని హోంశాఖ కార్యదర్శి నుంచి ఆదేశాలు వచ్చాయి. చాలా సందిగ్ధం నెలకొంది. ప్రధాని మోదీకి నేను చెప్పదలుచుకున్నదొక్కటే. 120 కోట్ల మంది నిర్ణయంతో మీరు అధికారంలోకి వచ్చారు. జమ్ముకశ్మీర్... ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం. రెండు దేశాల సిద్ధాంతాన్ని తిప్పికొట్టి, లౌకిక భారత్తో కశ్మీర్ చేతులు కలిపింది. మా ప్రత్యేకతతో రాజ్యాంగ రక్షణలు లభించాయి. ఈ రాజ్యాంగ రక్షణలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానాలు తలెత్తుతున్నాయి."
-మెహబూబా ముఫ్తీ, పీడీపీ నేత
కశ్మీర్ హోదాపై వస్తున్న ఊహాగానాలకు తెరదించాలని ఇతర పార్టీ నేతలతో గవర్నర్ను కలసి విజ్ఞప్తి చేశారు మెహబూబా. తమకున్న కొద్దిపాటి ప్రత్యేకతను కేంద్రం దోచుకోవాలని చూస్తుందన్నారు ముఫ్తీ.
"మతపరమైన విభజన వద్దనుకుని, లౌకిక రాజ్యం వైపు మొగ్గు చూపిన ఒకే ఒక్క ముస్లిం మెజారిటీ రాష్ట్ర ప్రేమను మీరు కోల్పోయారు. ముసుగులు తొలగిపోయాయి. ప్రజలకు బదులుగా భూభాగాన్ని భారత్ ఎంచుకుంది."
-ట్విట్టర్లో మెహబూబా ముఫ్తీ
కశ్మీరీలు పొందే సదుపాయాలు వారి స్వదేశం భారత్ నుంచి వచ్చేవేనని ముఫ్తీ మహ్మద్ సయీద్ అనేవారని, కానీ అదే దేశం తమను దోచుకోవాలని చూస్తోందని ముఫ్తీ ఆరోపించారు.
భారత దేశ కీరిటంగా పిలిచే రాష్ట్రానికి సంబంధించిన అంశంలో అక్కడి ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకపోవడం సరికాదన్నారు మెహబూబా.
భద్రతా కారణాలే: గవర్నర్
భద్రతా కారణాలను అమర్నాథ్ యాత్ర వంటి మిగతా అంశాలతో కలిపి చూడటం వల్లే కశ్మీర్లో భయాందోళనలు ఉత్పన్నమవుతున్నాయన్నారు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్.
"పూర్తిగా భద్రతా కారణాలతో తీసుకుంటున్న చర్యలను మిగతా అంశాలతో ముడిపెడుతున్నారు. ఇదే భయాందోళనలకు కారణం. మౌనం వహించండి. వదంతులను వ్యాప్తి చేయకండి."
-సత్యపాల్ మాలిక్, జమ్ముకశ్మీర్ గవర్నర్
ఇదీ చూడండి: 'ప్రత్యేక' తొలగింపునకే అదనపు బలగాలా?