పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనడానికి చక్కని నిదర్శనం ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ప్రాంతానికి చెందిన మృగేంద్ర రాజ్. సుల్తాన్పుర్కు చెందిన బాల మేధావి 12 ఏళ్ల వయసులోనే 135 పుస్తకాలను రచించాడు. చిన్నారుల కథల పుస్తకాలు రాశాడేమో అని తేలిగ్గా తీసుకోద్దండోయ్. ఈ గడుగ్గాయి డీల్ చేసినవి ఎలాంటి అంశాలో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.
'ఆజ్ కా అభిమన్యు'(నేటి కాలపు అభిమన్యుడు) అనే కలం పేరుతో చేసిన రచనల్లో మతానికి సంబంధించిన పుస్తకాలు, మహాత్ముల జీవిత చరిత్రలు ఉన్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవితాన్నీ పుస్తకంలోకి ఎక్కించాడు ఈ రాబోయే తరానికి సిసలైన ప్రతినిధి.
ఆరేళ్ల వయస్సులో తొలి పుస్తకం
తన తొలి రచనను ఆరేళ్ల వయస్సులోనే చేశాడు ఈ ఆధునిక అభిమన్యుడు.
"రామాయణంలోని 51 పాత్రలను విశ్లేషించి పుస్తకాలు రాశాను. ప్రతి పుస్తకం 25 నుంచి 100 పేజీల మధ్య ఉంటుంది. ప్రపంచ రికార్డుల విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్నూ అందిస్తామన్నారు."
-మృగేంద్ర రాజ్, బాల రచయిత
ఈ అభినవ అభిమన్యుడి తల్లి ప్రైవేటు పాఠశాలలో టీచర్. తండ్రి రాష్ట్ర చెరకు పరిశ్రమలో పనిచేస్తున్నారు.
పెద్దయ్యాక రచయిత కావడం తన లక్ష్యమన్నాడు ఈ బాల మేధావి. వివిధ రంగాలకు సంబంధించిన అనేక పుస్తకాలను రచిస్తానని స్పష్టం చేశాడు.
ఇదీ చూడండి: 'జల యోగా'తో ప్రపంచ రికార్డుపై బుడతడి గురి!