భాజపా, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మయావతి. కాంగ్రెస్ ఎంత అవినీతి పార్టీనో.. భాజపా కూడా అంతే అవినీతి పార్టీ అని ఆరోపించారు. దళితుల ఓటర్లను ఆకర్షించినందువల్లే గతంలో ఇరుపార్టీలు అధికారంలోకి రాగలిగాయన్నారు. హరియాణా కురుక్షేత్రలో గురువారం తమ మిత్రపక్ష పార్టీ అభ్యర్థి శశి సైనీ తరఫున ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మాయావతి ప్రసంగించారు.
దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ... పేదరికాన్ని నిర్మూలించడంలో విఫలమైందని ఆరోపించారు మాయావతి. భాజపా ప్రభుత్వం ఐదేళ్లుగా ఏపనీ చేయకుండా అబద్ధాలు ఆడుతోందన్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే దేశ భద్రత అంశాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు.
" కాంగ్రెస్ పార్టీ మాదిరి గానే భాజపా కూడా వ్యవహరిస్తోంది. బడా వ్యాపారులు, ధనికుల కోరిక మేరకే అవి పనిచేస్తున్నాయి. భాజపా, కాంగ్రెస్‌లు దళితులు, వెనుకబడిన వర్గాల వారిని ఎప్పుడూ ఓటు బ్యాంకు గానే వినియోగించుకున్నాయి. కానీ వారి స్థితిని మెరుగుపరచడంలో మాత్రం ఇరుపార్టీలు విఫలమయ్యాయి. ఇలాంటి పార్టీలకు మరోసారి అధికారం దక్కకుండా మనం కృషి చేయాలి."
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి