ఉత్తర్‌ప్రదేశ్‌లో చట్టాలపై నేరస్థులకు భయం లేదని.. అత్యాచార ఘటనలు సాధారణంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు బహుజన సమాజ్ పార్టీ అధినేత్ర మాయావతి. ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి నిప్పుపెట్టి హతమార్చిన ఘటనను బీఎస్పీ పార్టీ ఖండిస్తోందన్నారు.
ఉన్నావ్ ఘటనపై రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను కలిశారు మాయావతి. రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళల రక్షణకు తక్షణమే బాధ్యత తీసుకుని చర్యలు చేపట్టాలని కోరారు. రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్న అంశంపై గవర్నర్‌కు లేఖ అందించారు.
" ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం అపరాధమే నిండిపోయింది. చట్టాలపై నేరస్థుల్లో అసలు భయం లేదు. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. బలాత్కార ఘటనలు సాధారణంగా మారిపోయాయి. ఈ రోజు గవర్నర్‌ను కలిశాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పి.. ఆటవిక పరిపాలన నడుస్తోందని, మహిళలకు అసలు రక్షణ లేదని.. ఈ అంశంపై ఓ మహిళగా, గవర్నర్ స్థానంలో ఉన్నందున.. పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరాం. ముఖ్యమంత్రి, రాష్ట్ర పోలీసులతో సమావేశమై రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల రక్షణ కల్పించాలని ఆదేశించాలని విన్నవించాం. ఈ విషయంపై గవర్నర్‌కు లేఖ అందించాం."
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి.
ఇదీ చూడండి: పెళ్లి చేయడం లేదని తల్లిదండ్రులపై దాడి!