భారత పర్యటనకు వచ్చిన మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్ రూపన్‌కు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. లగేజీ ఎక్కువైన కారణంగా పృథ్వీరాజ్‌సింగ్ బృందాన్ని విమానాశ్రయ సిబ్బంది అడ్డుకున్నారు. అసలేం జరిగిందంటే..
మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్, మరో ఆరుగురు ప్రతినిధులతో కలిసి వారణాసికి వచ్చారు. రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరిగి దిల్లీ వెళ్తుండగా.. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా సిబ్బంది వీరిని అడ్డుకున్నారు. అధ్యక్షుడి బృందం లగేజీ పరిమితికి మించి ఉండటంతో అదనపు ఛార్జీలు చెల్లించమని అడిగారు. అయితే ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే వారు కలగజేసుకుని ఎయిరిండియా సిబ్బందికి తగిన సూచనలు చేశారు. అనంతరం పృథ్వీరాజ్ బృందం దిల్లీ బయల్దేరింది.
ఘటనను ఎయిర్‌పోర్టు డైరెక్టర్ అక్షదీప్ మాథుర్ ధ్రువీకరించారు. మారిషస్ అధ్యక్షుడిని అడ్డుకున్నారని తెలిసిన వెంటనే తాను జోక్యం చేసుకున్నానని తెలిపారు. జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఎయిరిండియా సిబ్బందితో మాట్లాడారన్నారు.
ఛార్జీలు వద్దు...
భారత పర్యటనకు వచ్చిన ప్రముఖుల అదనపు లగేజీకి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని ఎయిరిండియా సిబ్బందికి విమానయానశాఖ సూచించినట్లు తెలుస్తోంది. అయితే.. తాము నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించినట్లు ఎయిరిండియా మేనేజర్ ఆతిఫ్ ఇర్దిష్ తెలిపారు. పరిమితికి మించి లగేజీ ఉండటం వల్లే తమ సిబ్బంది ఛార్జీలు అడిగారని, ఉన్నతాధికారుల ఆదేశాల తర్వాత ఎలాంటి ఛార్జీలు లేకుండానే లగేజీ పంపించినట్లు తెలిపారు.