జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐరాసలో భారత్ చేసిన ప్రతిపాదనలకు చైనా ఎందుకు అడ్డుపడుతోంది? ప్రపంచదేశాలన్నీ భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నా డ్రాగన్ దేశం సహకరించకపోవడానికి కారాణాలేంటి?
స్వార్థ ప్రయోజనాల కోసమే భారత్ ప్రతిపాదనకు చైనా అడ్డుగా నిలుస్తోందని నిపుణులు చెబుతున్నారు.
పాకిస్థాన్‌లో చైనా రూ.వేలకోట్ల పెట్టుబడులు పెట్టడం, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని చైనా ప్రాజెక్టులకు ఉగ్రవాదుల నుంచి ప్రమాదం తలెత్తకుండా ఉండేందుకే ఉగ్రవాద సంస్థల పట్ల చైనా సానుకూల వైఖరి కనబరుస్తోందని తెలిపారు విదేశీ వ్యవహారాల నిపుణుడు రంజిత్ కుమార్.
" వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగానే పాకిస్థాన్‌కు చైనా ఎప్పుడూ మద్దతుగా నిలుస్తోంది. ఉగ్రవాద సంస్థలతో చైనా సత్సంబంధాలు కొనసాగించాలని భావిస్తోంది. పాకిస్థాన్‌లో చైనా వేలకోట్ల పెట్టుబడులు పెట్టింది. చైనాకు చెందిన వేల మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు పాక్ ఆక్రమిత కశ్మీర్లో పని చేస్తున్నారు. వీరందరికీ ఉగ్రవాదులు హానీ తలపెట్టే ప్రమాదముంది. పాకిస్థాన్ బలగాలు చైనీయులకు భద్రత కల్పించలేవని చైనాకు తెలుసు. అందుకే పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థలతో సయోధ్య కుదుర్చుకుంది. వారి ద్వారానే పాక్‌లో పనిచేసే చైనీయులకు రక్షణ కల్పించుకుంటోంది."
-రంజిత్ కుమార్,విదేశీ వ్యవహారాల నిపుణుడు
చైనా వ్యూహాలను ఎదుర్కునేందుకు భారత్ పటిష్ఠ ప్రణాళిక రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు చైనా అత్యున్నత సాహిత్య అవార్డు గ్రహీత ప్రొఫెసర్ బి.ఆర్.దీపక్. మసూద్విషయంలో చైనా తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇక నుంచైనా చైనా విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
"ఈ చర్యతో ఉగ్రవాదంపై చైనా రెండు మాటలు మాట్లాడుతోందని ప్రపంచ దేశాలకు తెలిసింది. ఇక నుంచి చైనాను మధ్యవర్తిగా ఎవరూ విశ్వసించరు. భారత్-చైనా విధానాల్లో మార్పులు తీసుకురావాలి. చైనా వ్యూహాలను ఎదుర్కొనేందుకు భారత్ ధృడమైన కార్యచరణ రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. అధికార సంతులితను అంతర్జాతీయంగా ప్రదర్శించాలి. చైనాపై చర్యలు మరింత క్రియాశీలకంగా ఉండాలి. చైనాను శత్రుదేశంగా భావించాలనుకుంటే మన శక్తి, సామర్థ్యాలు మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగాలి" -ప్రొఫెసర్ బి.ఆర్.దీపక్, చైనీస్ పరిశోధన నిపుణుడు
ఒకవైపు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతూనే... మరోవైపు ఉగ్రసంస్థల నిర్మూలనకు అడ్డుపడి చైనా రెండు నాలుకల ధోరణి అవలంభిస్తోందన్నారు భద్రతా నిపుణులు, మాజీ మేజర్ జనరల్ పి.కె. సెహగల్.
భారత్ సహకారం కోరుతున్న వియత్నం, తైవాన్ దేశాలకు ఆయుధాలు సమకూరిస్తే చైనాకు ఇబ్బందులు తప్పవని తెలిపారు సెహగల్. చైనాపై వ్యతిరేకతతో ఉన్న దేశాల మద్దతు కూడగట్టుకుని భారత్ మరిన్ని కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సమస్యలు సృష్టిస్తుందని చైనాకు భారత్ భయపడాల్సిన అవసరం లేదని సెహగల్ సూచించారు.
మసూద్ అజార్ లాంటి ఉగ్రవాదులను భారత్ పట్టుకోగలిగినా పెద్దగా ఉపయోగమేమి ఉండదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
జైషే మహ్మద్ అధినేత అజార్ లాంటి ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్న చైనానే... ఉగ్రవాదాన్ని ఎలా అంతం చేయాలో ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పాలని అమెరికా సహా ఇతర దేశాలు హెచ్చరిస్తున్నాయి.