చేసే స్నేహం మరువకు.. మరిచే స్నేహం చేయకు అన్నది నేటి తరం యువతలో ఉన్న ఓ సామెత. అక్షరాలా ఈ సామెతను నిజం చేశారు ఆ సైనిక మిత్రులు.
గరుడ్ కమాండో సైనిక విభాగానికి చెందిన కార్పోరల్ జ్యోతి ప్రకాశ్ నిరాలా 2017లో జమ్ముకశ్మీర్లో జరిగిన ఉగ్రకాల్పుల్లో అమరుడయ్యాడు. నిరాలా సంపాదనే కుటుంబానికి ఆధారం. కుమారుడు చనిపోయి కుటుంబం ఆర్థిక కష్టాల్లో పడింది. నిరాలాకు పెళ్లి కావాల్సిన చెల్లి ఉంది. ఈ స్థితిని గమనించిన గరుడ్ సైనికులు తలో రూ. 500 అందించి పెళ్లికి తోడ్పాటు అందించారు. అన్న లేని లోటు తెలియకుండా వీర జవాను చెల్లెలికి వివాహం జరిపించారు. పెళ్లిలో అన్న బాధ్యతలూ నిర్వర్తించారు.
సైనికుల ఉదారత పట్ల నిరాలా తండ్రి తేజ్ నారాయణ్ కృతజ్ఞతలు తెలిపారు. తమకు కుమారుడు లేని లోటు తెలియకుండా చేశారని ఆనందం వ్యక్తంచేశారు.
భారత ప్రభుత్వం కార్పోరల్ నిరాలాను మరణానంతరం అశోక చక్రతో సత్కరించింది.
ఇదీ చూడండి: 'ఏఈఎస్' బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా