సోదరుల సంతానం మధ్య వివాహం, సహజీవనం విషయంలో పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫస్ట్ కజిన్స్ (ఇద్దరు సోదరుల మొదటి సంతానం) వివాహం చేసుకోవటం కుదరదని, ఇది చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది.
ఏం జరిగిందంటే..
పంజాబ్ లూధియానాకు చెందిన 21 ఏళ్ల యువకుడు, 17 ఏళ్ల బాలిక కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. వీరు సొంత అన్నదమ్ముల మొదటి సంతానం. యువకుడిపై బాలిక కుటుంబం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతనిపై సెక్షన్ 363 (అపహరణ), 366ఏ (మైనర్పై అత్యాచారం) కేసులు నమోదు చేశారు.
ఈ విషయంలో పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు యువకుడు. బాలికతో కలిసి తమకు రక్షణ కావాలని పిటిషన్ దాఖలు చేశాడు. బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది.. బాలిక మైనర్ అని, ఇద్దరూ ఫస్ట్ కజిన్స్ అని కోర్టుకు విన్నవించారు.
భద్రత కల్పించండి..
ఇరువురి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ సింగ్.. పై వ్యాఖ్యలు చేశారు. బాలిక వయసు 18 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి చేసుకుంటామని చెప్పడమూ చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. లేదా సహజీవనం చేస్తామని చెప్పడం అనైతికమని వ్యాఖ్యానించారు.
అయితే, వారిద్దరికి ఎవరితోనైనా ముప్పు ఉన్నట్లయితే భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. కానీ, ఈ క్రమంలో వారిద్దరు చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్యే 'ఆత్మహత్యాయత్నం'పై దుమారం