తీరప్రాంత క్రమబద్ధీకరణ (సీఆర్‌జెడ్) నిబంధనల్ని ఉల్లంఘించి కేరళలోని మరదు గ్రామంలో నిర్మించిన అక్రమ భవన సముదాయాల్ని ఇవాళ, రేపట్లోగా పడగొట్టనున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు సెక్షన్ 144 విధించారు. ఫలితంగా భూ, జల, వాయు మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించనుంది.
నేడు, రేపట్లో
మరదు అక్రమ కట్టడాలను కచ్చితంగా కూల్చివేయాల్సిందేనని ఇంతకు ముందు సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. దీనితో అక్రమ భవనాల కూల్చివేతకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఎర్నాకుళం జిల్లా మేజిస్ట్రేట్ ఈ ప్రాంతంలో సెక్షన్ 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు శని, ఆదివారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు... అక్రమ భవనాల చుట్టూ ఉన్న 200 మీటర్ల వ్యాసార్థంలో అమల్లో ఉంటాయి.
శనివారం రెండు అక్రమ భవన సముదాయాలను అధికారులు కూల్చివేయనున్నారు. మిగలినవి ఆదివారంనాడు పడగొట్టనున్నారు.
మాక్ డ్రిల్
అక్రమ భవన సముదాయంలో మొత్తం 343 ఫ్లాట్లు ఉన్నాయి. ఇంప్లోషన్ పద్ధతిలో బాంబులను అమర్చి ఈ భవన సముదాయాన్ని కూల్చివేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరిసర భవనాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇందుకోసం ముందుగా మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్, పోలీసులు, కండిషనింగ్ అధికారులు ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నేలమట్టం కావాల్సింది భవనం కాదు... అవినీతి