అసోం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) తుది జాబితా శనివారం విడుదలైంది. 3 కోట్ల 11లక్షల 21వేల 400 మందికి జాబితాలో చోటు లభించింది. 19 లక్షల 6వేల 657 మంది పేర్లు ఎన్ఆర్సీ జాబితాలో లేవు. ఎన్ఆర్సీలో లేని వారిలో అనేక మంది ప్రముఖులు కూడా ఉండటం గమనార్హం.
కచర్ జిల్లా మాజీ ఎమ్మెల్యే కటిఘొర మౌలానా అతౌర్ రెహమాన్ మజహర్ భూయాన్‌కు ఎన్ఆర్సీ జాబితాలో చోటు దక్కలేదు. అభయపురికి చెందిన ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అనంత మల్లా పేరు కూడా జాబితాలో లేకపోవడం వల్ల ఆయన నియోజకవర్గంలో తీవ్ర దుమారం రేగింది. దల్గావ్ ఎమ్మెల్యే ఇలైస్ అలి కుమార్తె సహా మరో నలుగురు కుటుంబ సభ్యుల పేర్లనూ జాబితా నుంచి తప్పించారు.
శనివారం విడుదలైన ఎన్ఆర్సీలో అనేక మంది రక్షణ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగుల పేర్లూ కనిపించలేదు. రక్షణశాఖ మాజీ ఉద్యోగి బిమల్ చౌదరిని ఎన్ఆర్సీ జాబితాలో చేర్చలేదు. కానీ ఆయన కుటుంబ సభ్యులందరూ ఆ జాబితాలో ఉన్నారు.
అసలేంటీ ఎన్ఆర్సీ..
20వ శతాబ్దం మొదట్లో లక్షలాదిమంది బంగ్లాదేశీయులు అసోంకు వచ్చి స్థిరపడ్డారు. ముఖ్యంగా 1826 యండబో ఒప్పందం అనంతరం తూర్పు పాకిస్థాన్.. అంటే నేటి బంగ్లాదేశ్ నుంచి హిందువులు, ముస్లింలు అసోంలోకి పెద్ద ఎత్తున వలస వచ్చారు. స్వాతంత్య్రం అనంతరం కూడా ఈ ప్రక్రియ కొనసాగిన నేపథ్యంలో అసోం సంస్కృతి, భాష దెబ్బతింటోందంటూ ఆందోళనలు ప్రారంభమయ్యాయి.
ఇదీ చూడండి:- ఎన్ఆర్సీ జాబితాలో పేరు లేదని మహిళ ఆత్మహత్య