పీవీ నరసింహారావుజీతో నాకు 1988లో పరిచయమైంది. అప్పట్లో వర్థమాన దేశాల సంఘమైన సౌత్ కమిషన్‌కు నేను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తే, పీవీ భారత విదేశాంగ మంత్రి పదవి నిర్వహించేవారు. ఆయన జెనీవాకు వచ్చినప్పుడు తొలి పరిచయమైంది. 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేటపుడు, 'రండి. మీరే నా ఆర్థిక మంత్రి' అని నన్ను స్వాగతించారు. ఆర్థిక మంత్రి పదవీ నిర్వహణలో నాకు మీ అండదండలు పూర్తిగా ఉంటాయంటేనే పదవి స్వీకరిస్తానని అంతకుముందే పీవీకి తెలియజెప్పాను. దానికి ఆయన 'పదవీ నిర్వహణలో మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మీ విధానాలు విజయవంతమైతే ఆ ఘనత మీకే దక్కుతుంది. ఒకవేళ అవి విఫలమైతే పదవి నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది' అని సగం సరదా, సగం గాంభీర్యం మిళితమైన స్వరంతో వ్యాఖ్యానించారు. ప్రమాణ స్వీకారోత్సవం ముగిశాక ప్రధాని పీవీ.. ప్రతిపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఆర్థిక మంత్రి హోదాలో నా ఆలోచనలను ఆ సమావేశంలో పంచుకున్నాను. నన్ను ఆ పదవిలో చూసి, నా దృక్కోణాన్ని ఆలకించి ప్రతిపక్ష నాయకులు దిగ్భ్రాంతులైనట్లు కనిపించింది. ఆర్థిక సంస్కరణలు ఉన్నపళాన జరిగినవి కావు, నాడు దేశానికి దార్శనిక రాజకీయ నాయకత్వం లభించడం వల్లనే ఈ చరిత్రాత్మక మార్పు సంభవమైంది. మన ఆర్థిక విధానాలకు కొత్త దశ,దిశ ఇవ్వాలని, సామాజిక న్యాయమే ధ్యేయంగా శీఘ్ర ఆర్థిక ప్రగతి సాధించాలని మొట్టమొదట గ్రహించినది ఇందిరా గాంధీ. ఆమె తొలి అడుగులు వేస్తే రాజీవ్ గాంధీ వాటి వేగం పెంచారు. ప్రపంచం నూతన సమాచార సాంకేతిక యుగంలోకి ప్రవేశిస్తోందని ముందుగానే గ్రహించి, ఆ దిశగా వడివడి అడుగులు వేశారు. 1980వ దశకం ద్వితీయార్థంలో రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరచిన పునాదుల మీదనే పీవీ సర్కారు ఆర్థిక సంస్కరణలు రివ్వున పైకెగిశాయి.
మానవీయ కోణంతో..
దేశాభ్యుదయానికి ఆర్థిక సంస్కరణలు ఎంతో కీలకమని గ్రహించి, వాటిని ప్రవేశపెట్టడంలో నరసింహారావు చూపిన తెగువను అందరం అభినందించాలి. అదే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి. ఆర్థిక సంస్కరణలను తెచ్చేటప్పుడు భారతీయ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఎండీ మిషెల్ క్యాండెసస్‌తో సమావేశమైనప్పుడు నరసింహారావుజీ ఆయనతో ఈ మాటే చెప్పారు. భారత ప్రజల అవసరాలు, ఆశయాలను నెరవేర్చే విధంగా సంస్కరణలను రూపొందిస్తామని తెలిపారు. వ్యవస్థాపరమైన సర్దుబాటు కార్యక్రమం పేరుతో భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏ ఒక్కరూ ఉద్యోగం కోల్పోరాదని క్యాండెసస్‌కు స్పష్టం చేశారు.
విదేశాంగ విధానంలో కీలక మలుపులు
నరసింహారావు భారత విదేశాంగ విధానంలో వాస్తవికతకు అగ్రాసనం వేశారు. సిద్ధాంత రాద్ధాంతాలకన్నా వాస్తవిక దృక్పథమే మిన్న అని నిరూపించారు. చైనాతో ఏర్పడిన పొరపొచ్చాలను తొలగించడానికి 1993లో చైనాను సందర్శించారు. తూర్పు, ఆగ్నేయాసియా దేశాలతో సహకార వృద్ధికి తూర్పు వైపు చూపు విధానాన్ని చేపట్టిన ఘనత పీవీదే.
రక్షణపరంగా భారత్ బలోపేతం
నరసింహారావు ప్రభుత్వ హయాంలోనే భారతదేశం క్షిపణి బలగాన్ని పటిష్ఠపరచుకోవడానికి, బాలిస్టిక్ మిస్సైల్ టెక్నాలజీ కార్యక్రమాన్ని చేపట్టింది. 1992లో ఏఎస్‌ఎల్వీ, పీఎస్‌ఎల్వీ రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది. 1994లో పృథ్వి క్షిపణి ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తిచేసి, తరవాత దీన్ని మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణిగా అభివృద్ధి చేశారు. దేశ భద్రతపై పీవీ ఇలా చెరగని ముద్ర వేశారు. పీవీ భరతమాతకు గర్వకారణమైన పుత్రరత్నం. నాకు గొప్ప మిత్రుడు, తత్వబోధకుడు, పలు విధాల మార్గదర్శి కూడా. అంతటి మహానుభావుడికి నివాళులర్పించడం నాకెంతో ఆనందదాయకం. ఆయనతో సన్నిహితంగా మెలగిన వ్యక్తిగా నేనొక విషయం చెప్పగలను. ఆయన స్వలాభం కోసం పాకులాడకుండా, ఫలాపేక్ష లేకుండా విధులు నిర్వహించిన నిజమైన కర్మసన్యాస యోగి. ఈ దేశ సనాతన సంప్రదాయాలు, ఈ దేశ ప్రవృత్తిని అణువణునా ఇముడ్చుకుని కూడా, ఆధునికత దిశగా దేశాన్ని ఉరికించిన ద్రష్ట. గతం, భవిత అనే జోడు గుర్రాలపై నేర్పుగా దూసుకెళ్లిన నాయకుడాయన. మహానాయకుడు, ప్రియతమ పూర్వ ప్రధానమంత్రి అయిన పీవీ నరసింహారావు గారికి ఆయన శతజయంత్యుత్సవాల సందర్భంగా ఇవే నా నమస్సుమాంజలులు.
- మన్మోహన్ సింగ్, మాజీ ప్రధానమంత్రి