బిహార్ గయా జిల్లాలో ఓ మారుమూల గ్రామం కొథిల్వా. అక్కడ మావోయిస్టుల తాకిడి ఎక్కువ. అక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం, పశుపోషణ. అయితే అక్కడ కేవలం ఏడాదికి ఒక పంటే పండుతుంది. అదీ వర్షం పడితేనే. దీని వ్లల గ్రామస్థులు పేదరికంలో కూరుకుపోయి... వలస బాట పట్టేవారు. అయితే అదే గ్రామానికి చెందిన లాంగీ భుఈ... వారిలా వలస పోలేదు. కన్న ఊరును వదులుకోలేదు.
30 ఏళ్ల వయసులో...
ఆ సమస్యను చూసి ఎలాగైనా పరిష్కారించాలనుకున్నాడు భుఈ. 30 ఏళ్ల వయసులో ఈ బృహత్కార్యానికి నాంది పలికాడు.
ఎప్పటిలాగే కొండ ప్రాంతానికి మేకలను మేతకు తీసుకెళ్లిన భుఈ... వృథాగా పోతున్న వర్షం నీటిని చూశాడు. ఆ పర్వత ప్రాంతంలోని నీటిని తన గ్రామానికి తీసుకెళ్లాలనే ఆలోచన ఆయనకు పుట్టింది. అయితే ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు. భుఈ ఒక్కడే నడుం బిగించాడు.
ఎవరి సాయం తీసుకోలేదు..
గ్రామస్థుల సాయం తీసుకొకుండా 30 ఏళ్ల క్రితం కాలువ తవ్వడం మొదలుపెట్టాడు. అయితే మొదట్లో గ్రామస్థులందరూ... అతనికి పిచ్చి పట్టిందని ఎగతాళి చేశారు. కొంతమంది 'ఇది నీ వల్ల అయ్యే పని కాదు వదిలేమని' సలహా ఇచ్చారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా దృఢ సంకల్పంతో శ్రమించి... గ్రామంలోని చెరువు వరకు 3 కిలోమీటర్ల కాలువను తవ్వాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వ్యవసాయ సాగుకు, పశుపోషణకు ఆ నీరు ఉపయోగపడుతుంది. ఫలితంగా 'కెనాల్ మ్యాన్' అని అతనిపై స్థానికులే కాకుండా నెటిజన్లూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇద్దరిదీ ఒకే జిల్లా...
కొండపై కోపం, భార్యపై ప్రేమతో కొండను తొలిచి రోడ్డును నిర్మించిన దశరథ్ మాంఝీ.. కాలువ తవ్విన భుఈ ఇద్దరిది ఒకే జిల్లా కావడం విశేషం.
ఇదీ చూడండి: లాక్డౌన్ భగీరథులు: బోర్ కొట్టి బావులు తవ్వేశారు!