దేశ ప్రజలకు చట్టంపై గౌరవం ఏ స్థాయిలో ఉందో చాటిచెప్పాడు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ కేసులో నిందితుడిగా ఉన్న అతడు... ఏకంగా 1400 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి పోలీసులకు లొంగిపోయాడు. అతను అంత దూరం నుంచి సైకిల్‌పై రావడం చూసి పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. పూల మాలతో స్వాగతం పలికారు.
ఏం జరిగింది?
మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రాంతానికి చెందిన ముకేశ్ కుమార్ వివాహం చేసుకొని బిహార్‌లోని సీతామఢిలో స్థిరపడ్డాడు. అయితే ఆరేళ్ల క్రితం(2014లో) తన బంధువుతో జరిగిన ఘర్షణలో ముకేశ్‌పై కేసు నమోదయింది. ఈ మేరకు ఉజ్జయినిలోని నాగ్ఝీరి పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. అయితే వాటికి ముకేశ్ స్పందించకపోవడం వల్ల.. అతని చిరునామా తెలుసుకున్న పోలీసులు శాశ్వత వారెంట్‌ను జారీ చేశారు. పోలీసు స్టేషన్‌కు వచ్చి కనిపించాలని పేర్కొన్నారు.
దారి మధ్యలో కూలీ పనులు
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ముకేశ్ సైకిల్‌పై బిహార్‌లోని సీతామఢి నుంచి మధ్యప్రదేశ్‌లోని నాగ్ఝీరి పోలీసు స్టేషన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ప్రయాణ ఖర్చుల కోసం మార్గం మధ్యలో అక్కడక్కడ కూలీ పనులు చేస్తూ... 10 రోజుల్లో 1400 కిలోమీటర్లు ప్రయాణించి చివరికి స్టేషన్‌కు చేరుకున్నాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు... పూలమాలతో స్వాగతం పలికారు.
చట్టాన్ని ఎలా గౌరవించాలో, ఎలా కట్టుబడి ఉండాలో తెలిసిన వారిలో ముకేశ్ ఒకరని స్టేషన్ ఇంఛార్జ్ సంజయ్ వర్మ అన్నారు. అయితే ముకేశ్‌ను న్యాయస్థానం ముందు హాజరు పరిచి, శిక్ష ఖరారైతే జైలుకు పంపుతామని తెలిపారు. కానీ పోలీసులందరి మనస్సుల్లో ముకేశ్ చిరస్థాయిగా నిలిచిపోతాడని కొనియాడారు.
ఇదీ చూడండి: 'వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి అప్పుడే'