మానవత్వం లేకుండా కర్కశంగా ఓ యువకుడి ప్రాణాలు తీశారు ఇద్దరు దుండగులు. రోడ్డుపైనే అజయ్ అనే యువకుడిని ఇనుప రాడ్డులతో చితకబాది చంపారు. ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లో 'లోనీ' పట్టణంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
బాధితుడు రక్తపుమడుగులో పడిపోయి ఉన్నప్పటికీ.. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులు, వాహనదారులు చూస్తూ ఉండిపోయారే తప్ప.. సహాయం చేయడానికి ముందుకు రాలేదు. సమీపంలోని వ్యక్తి ఈ వీడియోను తీసినట్లు తెలుస్తోంది.
నగరంలో పూల దుకాణం పెట్టుకునే విషయంపై బాధితుడికి.. నిందితుడికి మధ్య తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారితీసినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయంపై బాధితుడి సోదరుడు ఇది వరకే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చి పంపించారు పోలీసులు.
కాగా.. తాజా దాడికి పాల్పడిన నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.