పౌరసత్వ చట్టం విషయంలో ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. ఐరాస రిఫరెండం వ్యాఖ్యలపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో మీడియా సమావేశం పెట్టి వివరణ ఇచ్చారు దీదీ.
"నా దేశం పట్ల నాకు గౌరవం ఉంది. ప్రజలపై నాకు అమితమైన విశ్వాసం ఉంది. నేను కోరింది ఏటంటే.. ఒక కమిటీ ద్వారా నిపుణులతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. ఈ ప్రక్రియను ఐరాస పర్యవేక్షించాలని మాత్రమే చెప్పాను."
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన దీదీ.. ఇది గెలుపోటముల సమస్య కాదని, దేశానికి సంబంధించినది అని చెప్పారు. ఈ విషయంలో పునరాలోచించాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీను వెనక్కి తీసుకోవాలన్నారు.
మమత వ్యాఖ్యలపై విమర్శలు..
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రానికి సవాలు విసిరారు. ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని గురువారం డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'పౌర' చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణకు దీదీ డిమాండ్
మమత వ్యాఖ్యలపై పలువురు మండిపడ్డారు. భారత అంతర్గత విషయాల్లో ఐరాసను జోక్యం చేసుకోవాలనటం బాధ్యతా రహితమైన వ్యాఖ్యలుగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
మమత ప్రకటనను తాను సమర్థించటం లేదని బంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలన్నారు. దీదీ వ్యాఖ్యలు భారత పార్లమెంటును కించ పరిచేలా ఉన్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు.