ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని అమలు చేస్తామని బంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా ప్రకటించడంపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. రైతుల్లో ఆదరణ కోల్పోతున్నామని గ్రహించిన తర్వాతే కేంద్ర పథకాలను అమలు చేసేందుకు అంగీకరించారని ఎద్దేవా చేశారు.
కత్వా, బర్ధమాన్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న నడ్డా.. దీదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాగానే అన్నదాతలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల కోసం 'కృషక్ సురక్ష అభియాన్' కార్యక్రమాన్ని ప్రారంభించారు.
"కేంద్ర పథకాలు అడ్డుకోవడం వల్ల రైతులు ఆగ్రహానికి గురవుతున్నారని తెలిసి టీఎంసీ బలవంతంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రైతుల ఆగ్రహం కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టీఎంసీ తుడిచిపెట్టుకుపోతుందనే భయంతో కేంద్ర పథకాలను అమలు చేస్తున్నారు. ఎన్ని పథకాలు అమలు చేసిన టీఎంసీని రైతులు నమ్మే పరిస్థితి లేదు."
-జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు
తూర్పు బర్ధమాన్ జిల్లాలోని జగదానందపుర్లో రైతుల ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు నడ్డా. అంతకుముందు చాల్ సంగ్రహో కార్యక్రమంలో భాగంగా ఐదుగురు రైతుల నుంచి పిడికెడు చొప్పున ధాన్యాన్ని స్వీకరించారు.
దిల్లీ రైతుల సంగతేల?
మరోవైపు, నడ్డా పర్యటనపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. రాష్ట్రంలో రైతుల గురించి భాజపా ఆందోళన వ్యక్తం చేయడం అంతా మాయేనని పేర్కొంది. దిల్లీ సరిహద్దులో నిరసన చేస్తున్న రైతుల గురించి భాజపా నేతలకు పట్టడం లేదని ధ్వజమెత్తింది.
"దేశవ్యాప్తంగా ప్రయాణించి మొసలి కన్నీరు కార్చేందుకు మాత్రం భాజపా నేతలకు సమయం ఉంది. కానీ, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నవారిపై శ్రద్ధ వహించే సమయం లేకుండా పోయింది. దిల్లీ సరిహద్దులో ఉన్న రైతుల గళాన్ని భాజపా నేతలు వినిపించుకోవడం లేదు. రైతులపై భాజపా చూపించే శ్రద్ధ కేవలం మాయ."
-చంద్రిమా భట్టాచార్య, టీఎంసీ నేత, రాష్ట్ర మంత్రి
రైతుల సంక్షేమానికి టీఎంసీ పూర్తిగా కట్టుబడి ఉందని భట్టాచార్య పేర్కొన్నారు. రాష్ట్రంలోని 92 శాతం మంది రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకంలో భాగమయ్యారని తెలిపారు. మరణించిన రైతుల కుటుంబంలోని వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తోందని వెల్లడించారు. తమ పార్టీ రైతుల పక్షానే ఉందని, ఇకపైనా ఇదే కొనసాగుతుందని స్పష్టం చేశారు.