పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హద్దుమీరి మాట్లాడటంపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. ఆయన కయ్యానికి కాలుదువ్వే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దాగుడు మూతలు ఎంతోకాలం సాగవని హెచ్చరించారు. భారత్ అంటే ఏంటో మెరుపుదాడులతోనే సందేశమిచ్చామన్నారు. ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశం గురించి మాట్లాడారు.
"జిహాద్ అనే పేరు చెప్తూ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. పాక్ హద్దులు మీరుతోంది. ఇక దాగుడు మూతలు ఎన్నో ఏళ్లు సాగవు. అవసరమైతే భారత్ వాయు లేదా భూతల మార్గం ద్వారా కచ్చితంగా సరిహద్దులు దాటుతుంది. భారత్‌తో యుద్ధం చేయడమే పాకిస్థాన్ పాలసీగా పెట్టుకున్నట్లుంది. అదే గనుక నిజమైతే ఆ దేశానికి సరైన బుద్ధి చెబుతాం" - బిపిన్ రావత్, సైన్యాధిపతి
అంతర్జాతీయ సమాజం మద్దతుతో యుద్ధంలో అణ్వాయుధాలు ఉపయోగిస్తామన్న ఇమ్రాన్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. భారత్‌కు ఆ అవసరం లేదని అణ్వాయుధాలను యుద్ధంలో ఉపయోగించేది లేదని స్పష్టం చేశారు.
అమెరికా పర్యటన ముగించుకుని ఆదివారం స్వదేశానికి చేరుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమానాశ్రయంలో సొంత పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. కశ్మీరీలు జిహాద్ (పవిత్ర యుద్ధం) చేస్తున్నారని.. వారికి సాయం చేయడం కూడా జిహాదేనని అన్నారు. పాక్ ప్రజలు అండగా ఉంటే కశ్మీరీలు విజయం సాధిస్తారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను రావత్ తిప్పికొట్టారు.
- ఇదీ చూడండి: ద్వారక: నీట మునిగిన హర్షద్ దేవాలయం