మరో జన్మంటూ ఉంటే.. హరిజనులైన తల్లిదండ్రులకు అమ్మాయిగా పుడతానని మహాత్ముడు ఎన్నోసార్లు చెప్పారు. కుల, లింగ వివక్షకు గురవుతున్న దళిత బాలికకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు. బాపూజీ కోరుకున్నట్లే ఓ దళిత బాలికగా తన సొంత రాష్ట్రంలో మళ్లీ పుడితే మరింత ఆవేదన చెందేవారు. ఎందుకంటే గుజరాత్‌లో గత 23 ఏళ్లలో ఉన్నత కుటుంబాల చేతిలో 534 మంది దళితులు హత్యకు గురయ్యారు. గాంధీ పుట్టిన గుజరాత్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా ఇదే పరిస్థితి.
దళితులపై జరుగుతున్న అన్యాయాలను చూస్తుంటే.. ఓ హరిజన బాలికగా తాను ఎందుకు జన్మించాలని మహాత్ముడు కోరుకున్నాడో అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి గాంధీజీ అంటరాని తనాన్ని వ్యతిరేకించారు. మరుగుదొడ్లను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులను ముట్టుకోవద్దని మహాత్ముడి తల్లి చెప్పేవారు. హిందూ సమాజంలోని ఇతర ఉన్నత కులాల మాదిరిగానే సనాతన వైష్ణవులు అంటరానితనాన్ని పాటించేవారు.
అంటరానితనం ఓ మచ్చ...
హిందూ మతానికి అంటరానితనం ఓ మచ్చ అని గాంధీ కఠిన వ్యాఖ్యలు చేశారు. వేదాలు, పురాతన గ్రంథాల్లో అంటరానితనం గురించి ఎక్కడ ఉందో చెప్పాలని సంస్కృత పండితులను గాంధీజీ సవాలు విసిరారు.
"ఒకవేళ అంటరానితనాన్ని వేదాలు, పురాణాలు సమర్థిస్తే వాటిని వ్యతిరేకిస్తాను."
--- మహాత్మా గాంధీ.
హరిజనులను పెళ్లి చేసుకుంటేనే...
పారిశుద్ధ్య కార్మికులను, ఆవుల మృతదేహాలను పారవేసే వారిని అంటరానివారిగా భావించడం పాపమని గాంధీ స్పష్టం చేశారు. ఆ పాపాన్ని తొలగించుకోవాలంటే తపస్సు చేయాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. అంటరానితనాన్ని తొలగించేందుకు మహాత్ముడు కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులు, హరిజనులను పెళ్లి చేసుకుంటే.. అలాంటి వివాహమహోత్సవాలకే తాను హాజరవుతానని చెప్పారు. ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ భాషల్లో తన నేతృత్వంలో నడిచిన పత్రికలకు హరిజన్, హరిజన్ బంధు, హరిజన్ సేవక్ అనే పేర్లు పెట్టారు.
సేవాగ్రామ్ ఆశ్రమానికి సమీపంలోని సెగావ్ గ్రామవీధులను వాలంటీర్లు రోజూ రాత్రి శుభ్రం చేస్తూ ఉండేవారు. ఈ కార్యక్రమానికి హరిజన్ సంపాదకుడు, గాంధీజీ కార్యదర్శి మహాదేవ్ దేశాయ్ నేతృత్వం వహించేవారు. దేశాయ్ మరణించిన తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన ప్యారేలాల్.. హరిజన్ వారపత్రికలో ఈ విషయాన్ని తెలిపారు. ప్రచారం కోసం కాకుండా.. ఓ నిస్వార్థ సేవగా ఈ పని జరిగేది.
హరిజనులు, అంటరానితనంపై గాంధీజీ భావాలను మహాదేవ్ అర్థం చేసుకున్నట్లుగా మరెవరూ చేసుకోలేదు. ఓ సంపాదకుడిగా అక్షరాలతో ప్రచారమే కాదు.. రాత్రి వేళల్లో వీధులను శుభ్రం చేస్తూ.. తాను మరో దళిత కార్మికుడిగా మారేవారు.
"మహాదేవ్ వద్ద బకెట్, చీపురు ఉండేవి. తీవ్ర పని ఒత్తిడిలో కూడా ఆయన సేవా భావాన్ని వీడలేదు. గాంధీజీ వార పత్రికలను చూస్తే హరిజనులు, గ్రామాల అభ్యున్నతి కోసం ఆయన ఎంతలా పాటుపడే వారో అర్థమవుతుంది. అంటరాని తనం, గ్రామాల అభ్యున్నతిపై గాంధీజీ ఆలోచనలను పత్రికల ద్వారా అవగాహన పరచడమే కాదు. వ్యక్తిగతంగా వీధులను శుభ్రం చేసి తన తపనను చాటేవారు."
---ప్యారేలాల్, హరిజన్ సంపాదకుడు.
దేవాలయాల్లోకి స్వేచ్ఛగా వెళ్లాలి...
జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత 1933 నుంచి ఏడాది పాటు దేశవ్యాప్తంగా గాంధీజీ హరిజన్ యాత్ర చేశారు. ఎలాంటి షరతులు లేకుండా హరిజనులు హిందూ దేవాలయాల్లోకి స్వేచ్ఛగా వెళ్లాలని ప్రచారం చేశారు. ఈ పిలుపునకు తొలుత ప్రముఖ పారిశ్రామికవేత్త జమ్నలాల్ బజాజ్ స్పందించారు. హరిజనుల కోసం వార్ధాలోని దేవాలయం తలుపులు తెరిచారు.
ఆ తర్వాత కేరళలో ట్రావెన్కోర్ రాష్ట్ర మహారాజా దేవాలయాలలోకి దళితులను ఉచితంగా అనుమతించారు. కేరళలోని వైకోంలో దేవాలయాలకు వెళ్లే దారుల్లో దళితులపై ఉన్న ఆంక్షలకు వ్యతిరేకంగా జరిగిన సత్యాగ్రహ ఉద్యమానికి మహాత్ముడు పూర్తి మద్దతునిచ్చారు.
అంబేడ్కర్‌ను తీసుకోవాలని...
మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మధ్య అనేక విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ.. దేశ తొలి మంత్రి వర్గంలోకి అంబేడ్కర్‌ను తీసుకోవాలని జవహర్‌లాల్ నెహ్రూతో గాంధీజీ పట్టుపట్టారు.
'అంబేడ్కర్ ఎప్పుడూ కాంగ్రెస్‌ను వ్యతిరేకించారు. నేను ఆయనను మంత్రిగా ఎలా తీసుకోగలను ?' అని నెహ్రూ గాంధీజీని ప్రశ్నించారు. 'మీరు కాంగ్రెస్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? దేశం మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారా?' అని గాంధీజీ చమత్కరించారు. ఆ తర్వాత డాక్టర్ అంబేడ్కర్‌ను నెహ్రూ మొదటి మంత్రివర్గంలో న్యాయమంత్రిని చేశారు.
రాజ్యాంగ రూపకల్పనపై ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యునిగా డాక్టర్ అంబేడ్కర్‌ను తీసుకోవాలని గాంధీజీ సూచించారు. ఆ తర్వాత రాజ్యాంగ అసెంబ్లీ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా నియమించాలని పట్టుబట్టారు.
చట్టాలు ఉన్నా.. ఆచరణ ఎంత?
అంటరానితనాన్ని తొలగించే విషయంలో గాంధీజీ, అంబేడ్కర్ అవలంబించిన మార్గాలు భిన్నంగా ఉన్నాయి. చట్టం, రాజ్యాంగం అనుమతి వల్లే హరిజనులపై అన్యాయాన్ని సరిదిద్దవచ్చని అంబేడ్కర్ భావించారు. చట్టాలు మాత్రమే కాకుండా.. ప్రజల మద్దతూ చాలా అవసరమని గాంధీజీ నమ్మారు. అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు.
నేడు అంటరానితనం నేరమని చట్టాలు, రాజ్యాంగం చెబుతూనే ఉన్నాయి. కానీ.. ఆచరణలో దళితులు అన్యాయానికి గురవుతూనే ఉన్నారు.
ఇదీ సంగతి : 'సుస్థిర అభివృద్ధికి గాంధీ సిద్ధాంతాలు అవసరం'