'మూడింట రెండొంతుల స్థానాలు అధికార కూటమికే'... మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన వెంటనే పలు ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనా. ఈ లెక్కన భాజపా-శివసేన కూటమికి దాదాపు 190 పైచిలుకు స్థానాలు దక్కాలి. భాజపా-సేన కూడా 220 ప్లస్ గెలుస్తామన్నాయి. అయితే... గెలిచింది మాత్రం 161 స్థానాల్లోనే.
ఫలితాల అనంతరం మహారాష్ట్రలో భాజపాకు నష్టం కలిగిందా?.. స్థానాలు తగ్గే సరికి జోరుకు అడ్డుకట్ట పడిందా?... అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంచనాల్లేని దశనుంచి కాంగ్రెస్-ఎన్సీపీలు గట్టి పోటీనే ఇచ్చాయి. కానీ... ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు నెగ్గలేకపోయాయి.
పెరిగిన స్ట్రైక్‌రేట్...
భాజపా జోరు తగ్గిందన్న అనుమానాల నడుమ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సారి 2014లో కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేసి మంచి ఫలితాల్ని సాధించామని చెప్పుకొచ్చారు. దీనినీ అంగీకరించకతప్పదు.
''2014 ఎన్నికల్లో 260 స్థానాల్లో పోటీ చేసి 122 చోట్ల నెగ్గాం. ఈ సారి బరిలోకి దిగిన 164 స్థానాల్లో(భాజపా 150, మిత్రపక్షాలు 14) 105 గెలిచి మంచి ఫలితాన్నే సాధించాం. 2014లో 47గా ఉన్న మా స్ట్రైక్ రేట్... ఈ సారి 70కి చేరింది.
2014లో మేం 28 శాతం ఓట్లు సాధిస్తే...ఈ సారి పోటీ చేసిన 164 స్థానాల్లోనే 26 నుంచి 26.6 శాతం ఓట్లు పొందాం.''
- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి
2014లో లెక్కలు వేరే...
2014 శాసనసభ ఎన్నికల్లో భాజపా, శివసేన వేర్వేరుగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో కాషాయ పార్టీ 122 స్థానాల్లో నెగ్గి అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 63 స్థానాలతో రెండో స్థానం దక్కించుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీలు 42, 41 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఎన్నికల అనంతరం.. భాజపా-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
ఈ సారి పొత్తుగా బరిలోకి దిగిన అధికార కూటమి 161 స్థానాలే దక్కించుకుంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు విజయంతో ప్రభంజనం సృష్టించిన అనంతరం.. జరిగిన ఎన్నికలు అయినందున మంచి ఫలితాల్నే ఆశించింది భాజపా. కానీ... ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయిందనే చెప్పాలి.
ఓడిన మంత్రులు....
మహారాష్ట్రలో భాజపా జోరు తగ్గడానికి రెబల్స్ ఓ కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 288 నియోజకవర్గాల్లో 75 చోట్ల తిరుగుబాటు నేతలు బరిలోకి దిగితే.. అందులో 61 మంది భాజపా, శివసేన లక్ష్యంగా పోటీ చేసినవారే. వీరే భాజపాకు నష్టం చేకూర్చారని నమ్ముతోంది అధిష్ఠానం.
ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కొంత బయటపడినట్లే కనిపిస్తోంది. బరిలోకి దిగిన ఏడుగురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్ పరాజయం పాలయ్యారు. శివసేన నేత, ఉప సభాపతి విజయ్... ఎన్సీపీ అభ్యర్థి చేతిలో ఓడారు. పర్లీ నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే అనూహ్య ఓటమి చవిచూశారు. ఇక్కడ మోదీ, అమిత్ షా ఎన్నికల ప్రచారాలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఇంకా జల సంరక్షణ మంత్రి, వ్యవసాయ మంత్రి, ఇతర సహాయ మంత్రులకూ ఓటమి తప్పలేదు.
ఇదీ చూడండి: బిహార్‌లో ఖాతా తెరిచిన అసదుద్దీన్ పార్టీ