మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు సోమవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుంది. అధికారంలోకి ఎవరు వస్తారనే విషయంపై మధ్యాహ్నం వరకు స్పష్టత వస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు భాజపా, శివసేన కూటమిదేనని ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెప్పాయి. కాంగ్రెస్ సహా ఇతర పక్షాలకు ఏ మాత్రం అవకాశాలు లేవని స్పష్టం చేశాయి.
మహారాష్ట్రలో మూడింట రెండొంతులకు పైగా స్థానాలను భాజపా, శివసేన కూటమి దక్కించుకోవడం ఖామయని.. భాజపా సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థాయికి దాదాపుగా చేరుకుంటుందని న్యూస్18-ఇప్సోస్ సర్వే అంచనా వేసింది.
ధీమాగా భాజపా.. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్
మరాఠా గడ్డపై రెండోసారి అధికారం సొంతం చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతా పార్టీ.. ఈసారి మిత్ర పక్షం శివసేనతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగింది. భాజపా 164. శివసేన 124 స్థానాల్లో పోటీ చేశాయి. మరోవైపు గత వైభవాన్ని సాధించాలనే లక్ష్యంతో ప్రతిపక్ష కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ 147 స్థానాల్లో, ఎన్సీపీ 121 చోట్ల బరిలోకి దిగాయి. రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన 101, బీఎస్పీ 262 స్థానాల్లో పోటీ చేశాయి. 1400 మందికిపైగా స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
2014 ఎన్నికల పలితాలు..
2014 శాసనసభ ఎన్నికల్లో భాజపా 122 స్థానాల్లో, శివసేన 63 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 చోట్ల నెగ్గాయి. ఆ తర్వాత రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా ఆ రెండింటిని శివసేన సొంతం చేసుకుంది.
ఈసారి భాజపా గతంలో కంటే అధిక స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి: దిల్లీ పీఠం కోసం 'కాలనీ'లపై కేంద్రం కన్ను