మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భాజపా, కాంగ్రెస్ సహా పలుపార్టీల నేతలు తమదైన రీతిలో స్పందించారు. ప్రజలు భాజపాను ఆదరించారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనగా.. అధికార పార్టీ నైతికంగా ఓడిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
భాజపా పాలనకు గీటురాయి..
మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దీపావళికి ముందే ప్రజలు భాజపాను ఆశీర్వదించారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ రెండు రాష్ట్రాలో విజయం అక్కడి ముఖ్యమంత్రుల పనితీరుకు నిదర్శనమన్నారు.
భాజపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్న మోదీ.. ఈ కాలంలో వరుసగా రెండోసారి గెలవడం చాలా కష్టమని.. ఫలితాలు తమ పాలనకు గీటురాయి అని పేర్కొన్నారు. కనీసం మంత్రులుగా పనిచేసిన అనుభవంలేకున్నా ఫడణవీస్, ఖట్టర్ సుపరిపాలన అందించారని మోదీ కొనియాడారు.
మోదీ పాలనే గెలిపించింది..
మోదీ పాలన చూసే ప్రజలు మహారాష్ట్ర, హరియాణాల్లో భాజపాకు పట్టంకట్టారని భాజపా అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించారు. అనేక ఏళ్లపాటు ఇతరులు చేయలేని పనులను మోదీ 2.0 ప్రభుత్వం 5 నెలల్లో చేసి చూపిందన్నారు.
స్ట్రైక్‌రేట్ పెరిగింది..
గత ఎన్నికలతో పోల్చితే ఈసారి భాజపా మంచి ఫలితాలు సాధించిందన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.
''2014 ఎన్నికల్లో 260 స్థానాల్లో పోటీ చేసి 122 చోట్ల నెగ్గాం. ఈ సారి బరిలోకి దిగిన 164 స్థానాల్లో(భాజపా 150, మిత్రపక్షాలు 14) 105 గెలిచి మంచి ఫలితాన్నే సాధించాం. 2014లో 47గా ఉన్న మా స్ట్రైక్ రేట్... ఈ సారి 70కి చేరింది."
-దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర సీఎం.
'భాజపా నైతికంగా ఓడిపోయింది'
మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల్లో భాజపా నైతికంగా ఓడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ విమర్శించారు. కాషాయపార్టీకి ఓట్ల శాతం తగ్గడం ప్రజల్లో భాజపాపై ఉన్న వ్యతిరేకతను ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు.
'భాజపాను ప్రజలు తిరస్కరించారు'
హరియాణా ప్రజలు భాజపాను తిరస్కరించారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ విమర్శించారు. ఈ నిజాన్ని భాజపా నాయకులు అంగీకరించాలని పేర్కొన్నారు. ఇతర పార్టీలతో కలిసి (జుగాడ్) కాషాయపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చు. కానీ ప్రజలు దాన్ని హర్షించరని కమల్‌నాథ్ అన్నారు.
కలిసి రండి..
హరియాణాలో భాజపాకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని కాంగ్రెస్ నేత బీఎస్ హుడా అన్నారు. అందువల్ల విపక్షపార్టీలైన కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ, జేజేపీ, ఇతర పార్టీలవారు, స్వతంత్రులు కలిసి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని సూచించారు.
ఇదీ చూడండి: కర్తార్‌పుర్ నడవాపై భారత్-పాక్ ఒప్పందం