మహారాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఆ రాష్ట్ర జలవనరుల మంత్రి గిరీశ్ మహాజన్ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. వరద బాధితులకు పరామర్శ సందర్భంగా ఆయన సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. రాష్ట్రమంతా వరదలతో అతలాకుతలం అవుతుంటే విహార యాత్రలా.. మంత్రి సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదీ జరిగింది..
వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనలో భాగంగా సంగ్లీ, కోల్హాపుర్ జిల్లాలను సందర్శించారు మంత్రి గిరీశ్ మహజన్. బాధితులను పరామర్శించే సందర్భంలో ఓ బోటులో సహచరులతో కలిసి సెల్ఫీ వీడియో దిగారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బయటపడ్డాయి. ఫలితంగా గిరీశ్పై విమర్శలు తీవ్రస్థాయిలో చెలరేగుతున్నాయి.
ప్రతిస్పందన
మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోపై గిరీష్ మహాజన్ స్పందిస్తూ 'చాలా మంది నాతో స్వీయ చిత్రాలు తీసుకోవాలనుకుంటారు. వాళ్లందరికి నేను కాదని చెప్పలేను. ప్రస్తుతం అక్కడ సమస్య ఉంది. ప్రజలు బాధల్లో ఉన్నారని' అన్నారు.
ఇదీ చూడండి:అక్టోబర్ 31 నుంచి యూటీలుగా జమ్ముకశ్మీర్, లద్దాఖ్