ఏటా ఎందరో పేదలు నగరాలకు వలసపోవడం.. అక్కడ ఇటుకలు మోస్తూ.. కూలీ పనులు చేస్తూ.. చాలీచాలని సంపాదనలతో బతుకీడ్చడం చూస్తూనే ఉంటాం. మహారాష్ట్ర పాల్ఘర్లోని ఓ గ్రామంలోనూ పని దొరక్క, వ్యవసాయం చేసేకుందామన్నా భూమి లేక.. పట్నం బాట పట్టిన కటుంబాలను ఆపాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. బడినే వ్యవసాయ క్షేత్రంగా మార్చి వారికి ఊర్లోనే ఉపాధి కల్పించాడు.
పిల్లల చదువు కోసం...
కొమర్పడా తాలూకా, డొల్హారి బుద్రుక్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు బాబు చంగ్దేవ్ మోరే. 2016లో స్థానిక వ్యవసాయాధికారుల సహకారంతో కొన్ని విత్తనాలు తెచ్చి బడి ఆవరణలో చల్లడం ప్రారంభించాడు. అదే సమయంలో.. బడిలో చదివే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోవడం గమనించాడు. గ్రామంలో ఏటా కనీసం 35 కుటుంబాలు.. పట్టణానికి వలసపోతున్నారని గ్రహించాడు. వారితో పాటే పిల్లల చదువులు ప్రమాదంలో పడుతున్నాయని తెలుసుకుని ఓ ఆలోచన చేశాడు.
బడిలోనే సాగు...
సహోద్యోగి సంతోష్ పాటిల్‌తో కలిసి... స్కూల్ ఆవరణలో వ్యవసాయం ప్రారంభించాడు మోరే. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు వ్యవసాయం పట్ల అవగాహన కల్పించి బడి పొలంలో వారిచేత సేద్యం చేయించాడు. వచ్చిన దిగుబడినంతా వారే విక్రయించుకునేలా ఏర్పాటు చేశాడు. దీంతో, వలస వెళ్దామనుకున్నవారికి గ్రామంలోనే జీవనోపాధి లభించింది.
ఇప్పుడు ఈ బడి పొలంలో బెండకాయ, వంకాయ, పాలకూర, అల్లం, బంగాళదుంపలు, ఉల్లిపాయలు పండుతున్నాయి. లాక్డౌన్ వేళ వీరి వ్యవసాయ ఉత్పత్తులకు స్థానికంగా డిమాండ్ ఏర్పడింది. మోరే ఆశయానికి మంచి స్పందన లభించింది. వలసలు ఆపేందుకు వ్యవసాయం చేస్తున్న మోరేకు కొన్ని ఎన్జీఓల సహకారమూ అందింది. అక్షరధార అనే ఓ సేవా సంస్థ ఉల్లిపాయల సాగుకు రూ. 1.35 లక్షలు విరాళంగా ఇచ్చింది.
ఇప్పుడు, ఆ జిల్లా పరిషత్ పాఠశాల పేరు చుట్టుపక్కల గ్రామాల్లో మారుమోగుతోంది. ప్రైవేటు పాఠశాలలకు పంపాలనుకున్నవారు కూడా తమ పిల్లలను ఈ వ్యవసాయం నేర్పే ప్రభుత్వ బడిలో చేర్చుతున్నారు. ఫలితంగా.. 2018 నుంచి బడిలో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.
ఇదీ చదవండి: మాస్కు లేకపోతే వలంటీర్లుగా మారాల్సిందే!