ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు 2018నాటి కర్ణాటక పరిణామాలను తలపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఏర్పాటులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
2018లో కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజార్టీ దక్కని కారణంగా హంగ్ ఏర్పడింది. మొత్తం 222 అసెంబ్లీ స్థానాలుండగా భాజపా 104 సీట్లు సాధించింది. సాధారణ ఆధిక్యానికి 7 స్థానాలు తక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. కాంగ్రెస్‌కు 80 స్థానాలు, జేడీఎస్‌కు 37 స్థానాలు దక్కాయి. ఫలితంగా... ఈ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. అదే సమయంలో భాజపా నేత బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కర్ణాటక గవర్నర్ వాజుభాయ్‌వాలా ఆహ్వానించారు. బల నిరూపణకు ఆదేశించారు.
2018 మే 17వ తేదీన యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా కాంగ్రెస్, జేడీఎస్ పావులు కదిపాయి. ప్రభుత్వం ఏర్పాటుకు భాజపాను ఆహ్వానించటాన్ని సవాలు చేస్తూ మే 16న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం బల నిరూపణకు సిద్ధం కావాలని యడియూరప్పకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు 15 రోజుల గడువు ఇచ్చింది.
బలపరీక్షలో యడియూరప్ప విఫలం
ఎమ్మెల్యేల మద్దతు లేకపోవటం వల్ల బలపరీక్షలో యడియూరప్ప విఫలమయ్యారు. వెను వెంటనే కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ 14 నెలల తరవాత కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలగా... యడియూరప్ప నాయకత్వంలో భాజపా ప్రభుత్వం కొలువుదీరింది.
ఇప్పుడు మహారాష్ట్ర...
ఇప్పుడు మహారాష్ట్రలోనూ దాదాపు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొదట ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు భాజపాను ఆహ్వానించారు గవర్నర్ కోశ్యారీ. ఏడు రోజుల్లో బలనిరూపణ చేసుకోవాల్సిందిగా ఫడణవీస్ సర్కార్‌ను ఆదేశించారు. కర్ణాటకలో జరిగినట్లుగానే ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాను ఆహ్వానించటాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ విషయమై తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు... ఫడణవీస్ సర్కార్ తమ బలం నిరూపించుకోవాలని ఆదేశించింది. ఈ లోగా ఫడణవీస్ రాజీనామా చేయటం సంచలనమైంది.
ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఈ పరిణామాల్లో కనిపిస్తున్న ఒకే ఒక తేడా ఏంటంటే... మహారాష్ట్రలో ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కానీ కర్ణాటకలో మాత్రం అంతకుముందే కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్లు వేశాయి.
మొత్తంగా చూస్తే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటులో జరిగిన కీలక పరిణామాల్లో పూర్తిగా సారూప్యం లేకపోయినా దాదాపు అవే పరిస్థితులైతే ప్రతిబింబించాయన్నది వాస్తవం. ఏ పార్టీకీ మెజార్టీ రాకపోవటం తెరవెనక ఎన్నో రాజకీయాలు నడవటం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.