మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తరఫున బరిలో దిగిన అభ్యర్థుల్లో 15శాతం ఎన్‌సీపీ-కాంగ్రెస్ కూటమినుంచి బయటికి వచ్చినవారే! వారిలో అత్యధికులు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండటం గమనార్హం. అవినీతి, అక్రమాలకు పాల్పడినవారిని పార్టీలో చేర్చుకుని వారికి టికెట్లు కేటాయించడాన్ని మహారాష్ట్రలోని భాజపా మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘భాజపా దగ్గర వాషింగ్ యంత్రం ఉంది. ఎవరినైనా పార్టీలోకి తీసుకోవడానికి ముందు వారిని ఆ యంత్రంలో వేసి, గుజరాతీ నిర్మా పౌడర్‌తో శుభ్రపరుస్తాం’ అని సీనియర్ భాజపా నాయకుడు రావ్‌సాహెబ్ దాన్వె ఓ ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యానించారు.
అయితే ఎన్నికల ఫలితాల్లో అధికార స్థాపనకు అవసరమైన 145 స్థానాలను భాజపా గెలుచుకోలేకపోయింది. ఎన్నికలకు ముందు శివసేనతో కుదుర్చుకున్న పొత్తు సైతం ఫలితాల తరవాత గాలికెగిరిపోయింది. ఏదోరకంగా ఫడణవీస్ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న భాజపా నాయకత్వం- కాంగ్రెస్, ఎన్‌సీపీలనుంచి తగినంతమంది ఎమ్మెల్యేలను ఆకర్షించడంలోనూ విఫలమైంది. ఎన్‌సీపీలో అర్ధరాత్రి ముసలం పుట్టించి కలకలం రేపిన అజిత్ పవార్‌తో చేతులు కలపడం ద్వారా నైతికంగానూ భాజపా అపఖ్యాతిపాలైంది. ఆ చర్య ద్వారా- బంధం తెంచుకుని ఇతర పార్టీలతో చేతులు కలిపిందని శివసేనపై విమర్శలు గుప్పించే నైతిక హక్కును ఆ పార్టీ కోల్పోయింది.
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి 220 సీట్లు గెలుచుకుంటుందని, ఎన్నికల తరవాత రాష్ట్రంలో ఇక విపక్షమన్నదే ఉండదని భాజపా నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ తరచూ వ్యాఖ్యానించేవారు. ఆయనే మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం విపక్ష నాయకుడిగా ఉండటం గమనించాల్సిన విషయం!
కూటమి నిలుస్తుందా?
శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం అంతర్గత వైరుధ్యాల కారణంగా ఎప్పటికైనా కుప్పకూలుతుందన్నది భాజపా నమ్మకం. అయితే ఆ కూటమిని గట్టిగా కట్టి ఉంచాల్సిన కీలక బాధ్యతను ఎన్‌సీపీ నాయకుడు శరద్ పవార్ నెత్తికెత్తుకున్నారు. భాజపాతో పూర్వ విభేదాల నేపథ్యంలో కూటమి విచ్ఛిన్నం కాకుండా ఎలాగైనా కాపాడాలని పవార్ పట్టుదలగా ఉన్నారు. ‘ఎన్నికల తరవాత శరద్ పవార్ మూటముల్లె సర్దుకుని, రాజకీయాలనుంచి తప్పుకోవాల్సిందే’ అని ఎన్నికల ప్రచారంలో ఫడణవీస్ విమర్శలు ఎక్కుపెట్టారు. భారత్‌కు ప్రత్యర్థి దేశమైన పాకిస్థాన్‌ను శరద్ పవార్ పొగిడారని సాక్షాత్తు ప్రధాని మోదీ మహారాష్ట్రలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో పదునైన విమర్శలు చేశారు. ఎన్‌సీపీ మైనారిటీ విభాగం నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ గతంలో పాకిస్థాన్‌కు వెళ్ళినప్పుడు తనకు అక్కడ చక్కటి ఆతిథ్యం లభించిందని పవార్ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మలచుకునేందుకు భాజపా ప్రయత్నించింది. ‘మేం తలుపులు తెరిస్తే ఎన్‌సీపీ నుంచి పవార్ మినహా మిగిలిన నాయకులందరూ మా పార్టీలోకి బారులు కడతారు’ అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు- ఎన్‌సీపీ, భాజపాల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శరద్ పవార్ పేరు ప్రస్తావించడంతో ఇరు పార్టీల మధ్య అగాధం పూడ్చలేని స్థాయికి చేరింది.
ఫలితాల అనంతరం పవార్‌ను మంచి చేసుకునేందుకు భాజపా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవంక శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలెను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా నియమించనున్నారని వార్తలు వెలువడిన తరుణంలో- ఆమె సారథ్యంలో పనిచేయడం ఇష్టం లేని అజిత్ పవార్ భాజపాకు మద్దతుగా బయటకు వచ్చారు. తనతోపాటు పార్టీకి చెందిన మెజారిటీ శాసనసభ్యులు నడుస్తారని భావించిన అజిత్ పవార్ తన ఆశలు నెరవేరకపోవడంతో తిరిగి ఎన్‌సీపీ గూటికి చేరిపోయారు. శరద్ పవార్ వ్యూహ ప్రతివ్యూహాలకు, రాజకీయ దురంధరతకు ఆ మొత్తం పరిణామాలు అద్దం పట్టాయి.
మారిన రాజకీయ సమీకరణాలు..
మహారాష్ట్రలో మారిన రాజకీయ సమీకరణలు పార్టీల భవిష్యత్తునూ ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. ఇటీవలి మహారాష్ట్ర పరిణామాల్లో అత్యధికంగా లాభపడిన పార్టీ ఎన్‌సీపీ అయితే- దీర్ఘకాలంలో శివసేన భారీ నష్టం చవిచూడబోతోందన్న విశ్లేషణలు జోరుగా వినిపిస్తున్నాయి. సంప్రదాయంగా ఎన్‌సీపీ-కాంగ్రెస్‌లతో శివసేనది వైరి బంధం. ఇప్పుడు అవే పార్టీలతో శివసేన జట్టుకట్టడం ద్వారా- మహారాష్ట్రలో ఎన్‌సీపీ-కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లన్నీ భాజపా బుట్టలో పడటానికి థాకరేల పార్టీ కారణమైందంటున్నారు. సంప్రదాయ హిందు ఓట్లకు అదనంగా కాంగ్రెస్-ఎన్‌సీపీ వ్యతిరేక ఓట్లు జతపడితే భాజపాకు లాభమే తప్ప నష్టం ఉండదన్న విశ్లేషణ వినిపిస్తోంది. మరోవంక రాష్ట్రంలో ఈ దఫా ఎన్నికలు వస్తే ఎన్‌సీపీ-కాంగ్రెస్‌లు శివసేనతో పొత్తు పెట్టుకుని సీట్లు పంచుకుంటాయా అన్నది అతిపెద్ద ప్రశ్న! మరికొన్ని నెలల్లో మహారాష్ట్రలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రశ్నలన్నింటికీ దాదాపుగా సమాధానాలు లభించవచ్చు.