మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నుంచి భాజపా-శివసేన మధ్య ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది. చెరిసగం పాలన (50:50 ఫార్ములా)పై సేన పట్టువీడటం లేదు. నవంబర్ 9తో ప్రస్తుత అసెంబ్లీ గడువూ ముగిసింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భాజపాను ఆహ్వానించారు. గవర్నర్ నిర్ణయంతో రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడుతుందనే ఆశలు చిగురించాయి. త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ప్రజల్లో విశ్వాసం నెలకొంది.
స్వాగతించిన శివసేన..
గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది భాజపా భాగస్వామ్య పార్టీ శివసేన. నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను గవర్నర్ ఇప్పటికైనా ప్రారంభించారని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అతిపెద్ద పార్టీగా ఉన్న భాజపానే నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రథమ హక్కుదారని వ్యాఖ్యానించారు.
భాజపాను వ్యతిరేకిస్తాం
ప్రభుత్వ ఏర్పాటుపై బలనిరూపణ పరీక్ష జరిగితే భాజపాకు వ్యతిరేకంగా ఓటేస్తామని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తెలిపారు. ఒకవేళ శివసేన కూడా భాజపాను వ్యతిరేకిస్తే.. ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు మాలిక్. నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను గవర్నర్ ఆలస్యంగా ప్రారంభించారని ఆరోపించారు.
కుదరని సయోధ్య..
ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది భాజపా. కాషాయ పార్టీతో కూటమిగా బరిలోకి దిగిన శివసేన 56 సీట్లు గెలించింది. సీఎం పదవీకాాలాన్ని చెరి రెండున్నరేళ్లు పంచుకునే విషయంపై రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరక ఇప్పటి వరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు.