మే 21న జరగనున్న మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఖాళీగా ఉన్న తొమ్మిది స్థానాలకుగానూ ఇద్దరు అభ్యర్థుల్ని బరిలో దింపేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. దీంతో ఠాక్రే మండలిలో అడుగుపెట్టడం లాంఛనమే అవనుంది.
ఇదీ చూడండి: కశ్మీర్లో '4జీ'కి సుప్రీం నో... కమిటీ ఏర్పాటు
మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా భాజపా నుంచి నలుగురు, శివసేన, ఎన్సీపీ నుంచి ఇద్దరు చొప్పున, కాంగ్రెస్ నుంచి ఒకరు ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించడం వల్ల శివసేన నేతల్లో ఆందోళన వ్యక్తమైంది. ఒకవేళ ఇద్దరూ నామినేషన్లు వేస్తే ఎన్నికలు అనివార్యమయ్యేవి. కానీ చివరి క్షణంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గడం వల్ల ఠాక్రే ఎన్నికకు అడ్డంకులు తొలగిపోయాయి. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం వహిస్తున్న ‘మహా వికాస్ ఆఘాడీ’ కూటమిలో కాంగ్రెస్ కూడా భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.