బిహార్‌లోని కటిహార్ జిల్లాలోని మహానంద నదిలో జరిగిన బోటు ప్రమాదంలో మరో ఐదుగురి మృతదేహాలను సహాయక బృందం వెలికితీసింది. మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. బంగాల్లోని మాల్డా జిల్లాలో చంచల్ ప్రాంతంలో మృతదేహాలు బయటపడ్డాయి. మృతుల్లో ఇద్దరు బిహార్‌వాసులు కాగా, మరో ఏడుగురు బంగాల్‌కు చెందినవారు.
80 మంది పర్యటకులతో బంగాల్ నుంచి బిహార్‌కు వెళ్తున్న బోటు.. కటిహార్ జిల్లా దగ్గర శుక్రవారం బోల్తా పడింది. అధిక బరువు, నదీ ప్రవాహం ఎక్కువ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారికోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు.
జాతీయ విపత్తు నిర్వహణ దళం, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు సహాయకచర్యలు కొనసాగిస్తున్నాయి.
"సాధారణంగా పడవలో 40మంది మాత్రమే ప్రయాణించవచ్చు. కానీ ప్రమాద సమయంలో ఈ సంఖ్యకు రెండింతల మంది పడవలో ఉన్నారు. పడవ జాడ ఇంకా తెలియలేదు. పరారిలో ఉన్న పడవ యజమానిపై కేసు నమోదు చేశాం. బోటులోని వారిలో కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. మరి కొంతమందిని స్థానికులు కాపాడారు. దాదాపు 24 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. గజ ఈతగాళ్లతో గాలింపు చేపడుతున్నాం."
-పోలీసు అధికారి.
ఇదీ చూడండి : బిహార్: నదిలో బోటు బోల్తా- 20 మంది గల్లంతు