నామినేషన్ల దాఖలుకు చివరిరోజైన శుక్రవారం.. మహారాష్ట్రలో ప్రముఖ నేతలు తమ నామపత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో భాజపా తరఫున తొలి సీఎం ఫడణవిస్.. నాగ్‌పుర్ సౌత్‌వెస్ట్ నుంచి బరిలోకి దిగుతున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర మంత్రి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌లతో కలిసి వెళ్లిన ఫడణవిస్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆశిశ్ దేశ్ముఖ్తో ఎన్నికల్లో తలపడనున్నారు ముఖ్యమంత్రి.
ఆర్థిక మంత్రి, భాజపా నేత సుధీర్ ముంగంటివార్ బల్లార్పుర్ నుంచి పోటీ చేస్తున్నారు. మరో మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ షిరిడీ, మాజీ మంత్రి గణేశ్ నాయక్ ఏరోలి నియోజకవర్గాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు.
శిందే, పవార్ కూడా...
కోప్రీ పఛ్పఖాడీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్న శివసేన నేత, మంత్రి ఏక్నాథ్ శిందే ఇవాళ నామపత్రం సమర్పించారు.
బారామతి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఇదే సెగ్మెంట్ నుంచి నేడు నామినేషన్ వేశారు. భాజపాకు చెందిన గోపీచంద్ పాడల్కర్తో అమీతుమీ తేల్చుకోనున్నారు. నేటితో నామినేషన్ల గడువు ముగిసింది. అక్టోబర్ 5న నామపత్రాలు పరిశీలించనున్నారు. అక్టోబర్ 7న ఉపసంహరణకు తుది గడువు. అక్టోబర్ 21న ఎన్నికలు నిర్వహించి.. 24న ఫలితాలు ప్రకటించనున్నారు.
విజయం మాదే...
తమ సిద్ధాంతాల్లో తేడాలున్నప్పటికీ.. హిందుత్వ ధోరణితోనే ముందుకెళ్లి అధికారాన్ని నిలుపుకుంటామన్నారు ముఖ్యమంత్రి ఫడణవిస్. నేడు నామినేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో శివసేన, భాజపా సంయుక్త మీడియా సమావేశం నిర్వహించాయి. ఎన్నికల్లో విజయం తమ 'మహాయుతి' కూటమిదే అని ధీమా వ్యక్తం చేశారు ఫడణవిస్, ఉద్ధవ్ ఠాక్రే.
మొత్తం 288 స్థానాల్లో... శివసేన 126, మిగతా మిత్రపక్షాలకు 14 స్థానాలు మినహా.. అన్ని సీట్లలో భాజపా పోటీ చేస్తోందని ప్రకటించారు ముఖ్యమంత్రి. ఆదిత్య ఠాక్రే మంచి మెజారిటీతో భారీ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రెబల్ అభ్యర్థుల్ని.. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరారు.