పోరాటం ఏదైనా సమఉజ్జీల మధ్య అయితేనే... ఆ మజా ఏంటో తెలిసేది. మహారాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తే ఆ మాట ఎందుకు అనాల్సి వస్తుందో అర్థం అవుతుంది. ఇది తెలియాలంటే కొన్ని నెలలు వెనక్కి వెళ్లాల్సిందే. మహరాష్ట్ర ఎన్నికల ప్రచారం చివరి రోజు ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. జోరువానలో తడుస్తూనే ప్రసంగం కొనసాగించారు. ఆ రోజు కంటే ఇంకొంచెం ముందుకు.. అంటే సార్వత్రిక సమరం రోజుల్లోకి వెళ్లాలి.
శరద్ లక్ష్యంగా భాజపా..
మహారాష్ట్రలో ఎన్నో అంశాలు ఉన్నా.... అక్కడ భాజపా ప్రచారం మొత్తం ఎన్సీపీ లక్ష్యంగానే సాగింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోదీ-షాలు కాంగ్రెస్‌పై కాక శరద్ పవార్‌పైనే విమర్శలు గుప్పించారు. శరద్‌పై ఎందుకు గురిపెట్టారన్నది అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది.
అప్పుడు భాజపా లక్ష్యం ఒకటే... శివసేన ఎలాగూ వారితోనే ఉంది. కాంగ్రెస్ నామమాత్రంగా మారుతోంది. అలాంటి సమయంలో మరాఠా గడ్డపై బలమైన పార్టీగా కనిపిస్తోన్న ఎన్సీపీని దెబ్బకొట్టాలి. అదే లక్ష్యంతో సర్వశక్తులూ ఒడ్డారు. సామధానబేధ దండోపాయాలు ప్రయోగించారు. మరీ ముఖ్యంగా శరాద్ పవార్ కుటుంబంపై తీవ్రస్థాయిలోనే విరుచుకుపడ్డారు.
'పవార్ ఒంటరి'
లోక్‌సభ ఎన్నికలు ముగిసి.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత కూడా ఆ వేడి ఏ మాత్రం తగ్గలేదు. ఒకవైపు పవార్ కుటుంబంపై దాడి కొనసాగిస్తూనే... ఎన్సీపీకి చెందిన పలువురు నాయకులను భాజపాలోకి ఆకర్షించి టికెట్లు ఇచ్చారు. మరికొందరు శివసేనలోకి వెళ్లారు. పవార్ ఒంటరి అయ్యారని, ఆయన రాజకీయ జీవితం ముగిసిందని దేవేంద్ర ఫడణవీస్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
భాజపాపై ఒంటి చేత్తో పోరాటం
అప్పటి నుంచి భాజపా జాతీయ స్థాయి నాయకుల నుంచి రాష్ట్రస్థాయి శ్రేణుల వరకు అంతా ఎన్సీపీ కథ ముగిసిందనే వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఆ సమయంలోనే భాజపాతో కలిసి వెళదామని శరద్‌తో ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్ ప్రతిపాదించినట్లు సమాచారం. కానీ అక్కడే మొదలయింది అసలు పోరాటం. భాజపాపై ఒంటి చేత్తో పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు శరద్‌పవార్.
పవార్ దీటైన సమాధానాలు
భాజపా అధ్యక్షుడు అమిత్‌షా తనపై చేసిన ప్రతి విమర్శకు అంతే దీటుగా.. ఘాటుగా సమాధానం ఇచ్చారు పవార్. తాను రాష్ట్రానికి ఏమి చేసినా, చేయకున్నా జైలుకు మాత్రం వెళ్లలేదంటూ చురకలంటించారు. సహకార బ్యాంకు కుంభకోణంలో పెట్టిన ఈడీ కేసులనూ సానుభూతి పవనాలుగా మార్చుకున్నారు. శరద్ పవార్ స్వయంగా ముంబయిలోని ఈడీ కార్యాలయానికి వెళ్లడానికి సిద్ధపడ్డారు. తనను ఎప్పుడైనా విచారించుకోవచ్చంటూ అధికారులకు సవాలు చేశారు. సహకార బ్యాంకులో సభ్యత్వమే లేని తనపై ఎలా కేసు పెడతారని నిలదీశారు. ఈ చర్యలతో ప్రజల్లో ఆయనకు సానుభూతి లభించింది.
భాజపా లక్ష్యంగా శరద్
అది మొదలు... భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు కానీయబోనంటూ శరద్ పవార్ ఒంటరిగానే రాష్ట్రమంతటా విస్తృత ప్రచారం చేశారు. ఫలితంగా చివరి రోజుల్లో రాజకీయ వాతావరణం మారింది. సులువుగా అధికారంలోకి వస్తామనుకున్న భాజపాకు కష్టకాలం ఎదురయింది. ఎన్సీపీకి కూడా ఏ మాత్రం ఊహించని రీతిలో ఏకంగా 54 స్థానాలు వచ్చాయి. ఎన్సీపీ నుంచి భాజపాలోకి చేరిన తిరుగుబాటు అభ్యర్థులు అందరూ ఓటమి పాలయ్యారు.
ఫలితాల తర్వాత..
ఎవరికీ ఆధిక్యం రాని పరిస్థితుల్లో నిజానికి అప్పుడైనా 105 స్థానాలున్న భాజపా, 54 స్థానాలు ఉన్న ఎన్సీపీ కలిస్తే వేరొకరి సాయం లేకుండా సుస్థిర ప్రభుత్వం ఏర్పడేదే. పవార్ మాత్రం అప్పుడూ పోరాటానికే సై అన్నారు. వాళ్లనే ప్రభుత్వం ఏర్పాటు చేయమనండి సవాల్ విసిరారు.
వేగంగా కదిలిన షా.. శరద్
ఈ పరిణామాన్ని అమిత్‌షా వ్యక్తిగతంగా తీసుకున్నారా... అన్నంత స్థాయిలో భాజపా కూడా పావులు కదిపింది. ఏకంగా అజిత్ పవార్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత శరవేగంగా కదిలిన మరాఠా యోధుడి ఎత్తుగడలతో 78 గంటల్లో ఆ ప్రభుత్వం కూలి కూటమి సర్కార్‌కు తలుపులు తెరుచుకున్నాయి.
భాజపాకే ఎదురుదెబ్బ!
భాజపాకు మద్దతు ఇవ్వకూడదని శివసేన నిర్ణయించడం పవార్‌కు కలిసి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటుకు తనదైన శైలిలో చక్రం తిప్పారు. అప్పటి వరకూ పెదవి విప్పని మోదీ-షా రహస్యంగా కార్యాచరణ జరిపి సొంత కుటుంబ సభ్యునితోనే పవార్‌పై దెబ్బతీయాలని చూశారు .కానీ ఆ వ్యుహం భాజపాకే ఎదురు తిరిగినట్టయింది.
ఇదీ చూడండి: పార్లమెంట్ సంయుక్త సమావేశం బహిష్కరించిన విపక్షాలు