Heavy Rain Alert for Andhra Pradesh : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గడచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కిమీ, నాగపట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 590 కి.మీ, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ బలపడి రేపటికి తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.
రానున్న రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ ప్రభావంతో రానున్న 5 రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో, రానున్న 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈనెల 30 నుంచి ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు చెప్పుకొచ్చారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని తెలిపారు. ఏపీలోని అన్ని పోర్టుల్లో అధికారులు ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
రెయిన్ అలర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం - తుపానుగా మారే ఛాన్స్ - రాబోయే 3 రోజుల్లో వర్షాలు
ఇక గజగజలే - రానున్న వారం రోజుల్లో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు