మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సహా ఆయన కుటుంబానికి కల్పించే భద్రత స్థాయిని ఆ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. యూపీ మాజీ గవర్నర్ రామ్ నాయక్, ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే భద్రతనూ కుదించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ భద్రతను పూర్తిగా ఉపసంహరించుకుంది.
ఫడణవీస్‌కు ఇదివరకు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తుండగా.. దాన్ని తాజాగా 'ఎస్కార్ట్‌తో కూడిన వై ప్లస్'కు కుదించింది. ఆయన భార్య అమృత ఫడణవీస్, కూతురు దివిజ భద్రతను ఎస్కార్ట్‌తో కూడిన వై ప్లస్ నుంచి 'ఎక్స్' కేటగిరీకి తగ్గించింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఇద్దరి భద్రత స్థాయి పెరగగా.. 11 మంది భద్రతను కుదించారు. 13 మందికి కొత్తగా భద్రత కల్పించారు. 16 మంది భద్రతను ఉపసంహరించారు. కేంద్ర మంత్రి రాందాస్ అఠవాలే భద్రతను వై ప్లస్‌కు మార్చగా.. మరో కేంద్ర మంత్రి రావ్‌సాహెబ్ ధన్వె భద్రతను ఉపసంహరించుకుంది. కొత్తగా భద్రత కల్పిస్తున్న వారిలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్, రష్మీ ఠాక్రే(ఉద్ధవ్ భార్య) మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్ ఉన్నారు. వీరిద్దరికీ ఎక్స్ కేటగిరీ భద్రత అందనుంది.
రాజకీయ రగడ!
కాగా, భాజపా నేతలకు భద్రత తగ్గించడంపై ఆ పార్టీ వర్గాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వం విద్వేష రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర భాజపా ప్రతినిధి కేశవ్ ఉపాధ్యే ఆరోపించారు. కరోనా సమయంలోనూ ఫడణవీస్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారని, సీఎం మాత్రం ఇంట్లోనే కూర్చున్నారని ఎద్దేవా చేశారు. భద్రతను పూర్తిగా ఎత్తివేసినా.. ఆయన పర్యటించడం మాత్రం ఆపరని స్పష్టం చేశారు.
మరోవైపు, భద్రతను కుదించినంత మాత్రాన ప్రజలతో మమేకం కావాలన్న తన ప్రణాళికలను మార్చలేరని ఫడణవీస్ పేర్కొన్నారు.
అయితే రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మాత్రం విపక్షాల ఆరోపణలను ఖండించారు. నేతలకు ఉన్న ముప్పును సమీక్షించేందుకు ఐదుగురు సీనియర్ అధికారులతో కమిటీ నియమించినట్లు వివరించారు. దాని ప్రకారమే తాజా నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఏ సెక్యూరిటీ ఎలా..!
జెడ్ ప్లస్ సెక్యూరిటీలో భాగంగా బుల్లెట్ ప్రూఫ్ కారు, ఓ పోలీస్ ఇన్స్పెక్టర్, ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, రెండు ఎస్కార్ట్(ఒక్కోదాంట్లో ఆరుగురు కానిస్టేబుళ్లు) వాహనాలు, మరో పది మంది కానిస్టేబుళ్లు రక్షణగా ఉంటారు. జెడ్ కేటగిరీలో 22 మంది, వై కేటగిరీలో 11 మంది, ఎక్స్ కేటగిరీలో ఇద్దరు భద్రతా సిబ్బంది రక్షణగా ఉంటారు.
ఇదీ చదవండి: 'అజేయ' భారతం.. 'సూపర్ 50'తో సాధ్యం!