ఉత్కంఠగా సాగిన రాజకీయ పరిణామాల అనంతరం.. ఇవాళ ఉదయం మహారాష్ట్ర శాసనసభ సమావేశం కానుంది. ఉదయం 8 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశించారు. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా నియమితులైన కాళిదాస్ కొలంబ్కర్... కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
''నేడు శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశించారు. 288 మంది శాసనసభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.''
- ఓ అధికారి
288 స్థానాలున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 24న విడుదలయ్యాయి. అనంతరం.. 15 రోజుల తర్వాత కూడా రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేదని గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. నవంబర్ 12న అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి పాలన.. 23 వరకు కొనసాగింది. ఫలితంగా... శాసనసభ్యుల ప్రమాణ స్వీకారమూ ఆలస్యమైంది.
మంగళవారం రోజు సుప్రీం కోర్టు తీర్పుతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. తగినంత ఎమ్మెల్యేల బలం లేనందున సీఎం ఫడణవీస్ రాజీనామా చేశారు. అనంతరం.. మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ నెల 28న సీఎంగా ఠాక్రే ప్రమాణం చేయనున్నారు.