ఉత్తర్ప్రదేశ్ కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బారాబంకీలో కల్తీ మద్యం సేవించి ఇప్పటివరకు 16 మంది మృతిచెందారు. మరికొందరు స్థానిక రాంనగర్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. చనిపోయిన వారిలో ఎక్కువగా రానిగంజ్ వాసులే.
కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు. బాధితులకు మద్యం విక్రయించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. షాపు యజమాని కోసం గాలిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం విక్రయిస్తున్న షాపులపై పోలీసులు సోదాలు నిర్వహించారు. పలు చోట్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పరిహారం...
విషాదకర ఘటనలో బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించింది యూపీ సర్కార్.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం. జిల్లా ఎక్సైజ్ అధికారి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్తో సహా మొత్తం నలుగురు అధికారులను వెంటనే సస్పెండ్ చేసింది. ఉత్తర్ప్రదేశ్ ఎక్సైజ్ కమిషనర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించింది. ఘటనపై విచారణ చేపట్టి 48 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.