మధ్యప్రదేశ్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కొద్ది రోజుల విరామం అనంతరం.. మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంద్సౌర్, షాజాపుర్ జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంది. ఇక్కడ చంబల్ నది ఉప్పొంగి.. పలు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి.
రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో ఇంటిపైవరకు నీరు చేరుకున్నాయి.
ఆలయంలోకి వరద...
చంబల్ నదికి క్రమక్రమంగా వరద పెరుగుతుండటంతో.. గాంధీ సాగర్ ఆనకట్ట గేట్లు ఎత్తివేశారు. మంద్సౌర్లో ఓ వంతెన పైభాగాన్ని తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. ఇక్కడి ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయంలోకీ నీరు చేరింది.
షాజాపుర్లోనూ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. స్థానిక ఆసుపత్రుల్లోకి నీరు చేరిన కారణంగా... రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.