శ్రీరామునిపై అపారమైన భక్తితో 550 నోట్‌బుక్స్‌లో 'రామ్ రామ్' అని రామకోటి తరహాలో రాసింది లుధియానాకు చెందిన దీక్షా సూద్. ఈ కాపీలను అయోధ్య రామమందిరానికి అంకితం చేస్తున్నట్లు తెలిపింది. 2017లోనూ 250 నోట్‌బుక్స్‌లో 'రామ్ రామ్' అని రాసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది ఈ 21ఏళ్ల యువతి.
"2010 నుంచి రామ్ రామ్ అని రాయడం మొదలుపెట్టా. చిన్న నాటి నుంచి కుటుంబంతో కలిసి సత్సంగ్‌కు వెళ్లేదాన్ని. అందువల్లే శ్రీరామునికి గొప్ప భక్తురాలినయ్యా. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నందున వీటిని శ్రీరామునికి అంకితం చేస్తున్నా."
-దీక్షా సూద్.
ప్రతిఒక్కరు తమ తల్లిదండ్రులను గౌరవించి, రాముడిని పూజించాలని కోరుతోంది దీక్ష. ఏదో ఒక సమయంలో భగవంతుడి అనుగ్రహం దక్కుతుందని చెబుతోంది.
ఈ 550 పుస్తకాలను అయోధ్య పంపేందుకు సామాజిక సేవా సంస్థను ఆశ్రయించింది దీక్ష. అయోధ్యలో రామ బ్యాంక్‌లో ఈ నోట్‌బుక్స్‌ను భద్రపరుస్తామని సేవా సంస్థ కార్యకర్త తెలిపారు. వీలైతే భక్తులకు వీటిని పంపిణీ చేసే ప్రయత్నం చేస్తామన్నారు.