పార్లమెంటు వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ రెండో వారంలో నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉభయ సభల నిర్వహణ ప్రత్యామ్నాయ రోజుల్లో జరిగే అవకాశం ఉందని తెలిపాయి. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని భౌతికదూరం నిబంధనలు పాటించే విధంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
"సెప్టెంబర్ రెండో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఒకరోజు లోక్‌సభ, మరుసటిరోజు రాజ్యసభ సమావేశాల నిర్వహణ జరుగుతుంది."
-అధికార వర్గాలు
ఉభయ సభల నిర్వహణ వర్చువల్‌గా కాకుండా భౌతికంగానే జరుగుతుందని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. అయితే పార్లమెంట్లో ఎంపీల సీట్ల సర్దుబాటుపై తుదినిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
"లోక్‌సభ, రాజ్యసభ, సెంట్రల్ హాళ్లలో.. లోక్‌సభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. రాజ్యసభ సమావేశాలను.. రాజ్యసభ, లోక్‌సభ హాళ్లలో నిర్వహించే అవకాశం ఉంది. రాజ్యసభ సమావేశాలకు లాబీని కూడా వినియోగించుకునేందుకు పరిశీలన జరుగుతోంది. అయితే సీట్ల ఏర్పాట్లపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు."
-అధికార వర్గాలు
పార్లమెంట్ సమావేశాలు నాలుగువారాల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రవేశ ద్వారం, నిష్క్రమణ ద్వారాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.
ఒకేరోజు కాదు
అంతకుముందు, సెంట్రల్ హాల్ వేదికగా రెండు సభలను ఒకేరోజు నిర్వహించే అవకాశాలను పరిశీలించారు అధికారులు. లోక్‌సభను ఉదయం, రాజ్యసభను మధ్యాహ్నం నిర్వహించే అంశంపై కసరత్తులు చేశారు. అయితే విరామ సమయంలో సభను శానిటైజ్ చేయడం కష్టమని భావించి ఈ ప్రత్యామ్నాయ పద్ధతిని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి-'మాజీ సీజేఐపై దాఖలైన ఆ పిటిషన్ చెల్లదు'