అందమైన పర్వతాల నడుమ నిర్మించిన లూట్రా మహాదేవ్ ఆలయం దేశంలోని శైవక్షేత్రాలన్నింటిలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ కొలువైన మహాదేవుడికి 'సిగరెట్ శివుడి'గా పేరుంది. ఇతర ఆలయాల కంటే భిన్నంగా సిగరెట్లతో మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఆ సిగరెట్లను శివలింగంపై ఉంచగానే అవి వాటంతటవే వెలుగుతాయన్నది స్థానికుల విశ్వాసం.
హిమాచల్‌ప్రదేశ్ సోలన్ జిల్లాలోని ఆర్కి ప్రాంతం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లూట్రా మహాదేవ్ ఆలయం. ఆలయాన్ని గుహలో నిర్మించారు. గుహ పైకప్పును ఆలయం ఆకారంలోకి తీసుకురావడంలో నాటి సిబ్బంది పనితనం స్పష్టంగా కనిపిస్తుంది.
ఆలయ చరిత్ర..
1621లో బాఘల్ రాజు మహాదేవ్ ఆలయాన్ని నిర్మించారు. రాజుకు శివుడు కలలో కనిపించి తన ఆలయాన్ని నిర్మించాలని కోరగా.. లూట్రా మహాదేవ్ క్షేత్రాన్ని బాఘల్ నిర్మించారని ప్రతీతి. అగస్త్య రుషి ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారని స్థానికంగా చెబుతుంటారు. శివలింగంపై పొదుగు ఆకారపు రాళ్లనుంచి పాలు వస్తాయని స్థానికులు నమ్ముతుంటారు.
"ఆలయం నిర్మించిన గుహకు శతాబ్దాల చరిత్ర ఉంది. అగస్త్య ముని ఇక్కడే ధ్యానం చేసేవారు. అప్పుడు శివుడు కలలో కన్పించగా.. సముద్రుడి ప్రకోపం నుంచి భూమిని కాపాడాలని ముని కోరారు."
-ఆలయ పూజారి
ఏటా శివరాత్రి ఉత్సవాలను మహాదేవ్ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆ రోజున జరిగే శివపార్వతుల కల్యాణాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు.