ఆగ్రహం... ఆందోళన... విధ్వంసం... ఈశాన్య రాష్ట్రాల్లో ఎటు చూసినా ఇదే పరిస్థితి. పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజానీకం తీవ్రస్థాయిలో ఉద్యమిస్తోంది. పరిస్థితి చక్కదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధ్వయం విశ్వప్రయత్నాలు చేస్తోంది. భారీగా బలగాలను మోహరిస్తోంది. ఆంక్షలు విధిస్తోంది. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడంలేదు. కర్ఫ్యూ ఎన్నాళ్లూ కొనసాగుతుందో, జనజీవనం ఎప్పటికి సాధారణ స్థితికి వస్తుందో చెప్పలేని పరిస్థితి. అందుకే ఈశాన్య రాష్ట్రాల ప్రజానీకం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్తగా నిత్యావసర సరుకులను భారీ ఎత్తున కొనుగోలు చేస్తోంది.
అసోంలో దుకాణాలు ముందు బారులు..
అసోంలో కర్ఫ్యూ సడలించారన్న వార్తలతో ఈరోజు ఉదయాన్నే దుకాణాల ముందు వరుస కట్టారు ప్రజలు. గువాహటిలో ప్రధాన ప్రాంతాల్లో వినియోగదారుల రద్దీతో దుకాణాలు కిక్కిరిసిపోయాయి. బైకులు, కార్లలో వచ్చి సరుకుల కొని తీసుకెళ్లారు స్థానికులు. కర్ఫ్యూను ఉదయం 6గం. నుంచి మధ్యాహ్నం 1గం. వరకు మాత్రమే సడలించినట్లు అధికారులు తెలిపిన తర్వాత రద్దీ తగ్గుముఖం పట్టింది.
మొన్న పండుగ.. నేడు ఆందోళన...
హార్న్‌బిల్ ఫెస్టివల్‌తో గతవారం ఉత్సవాలు చేసుకున్న నాగాలాండ్ వాసులు ఇప్పుడు సరుకుల కోసం దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. అసోంలో నిరసనలు తీవ్రరూపం దాల్చినందున తమ రాష్ట్రానికి సరుకుల రవాణాకు అంతరాయం కలుగుతుందని ఈమేరకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతానికి ప్రజలకు సరిపడా సరుకులు దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాగాలాండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు.
నాగాలాండ్‌కు అసోం జీవనాధారం. ఇక్కడినుంచే ఆ రాష్ట్రానికి కావాల్సిన నిత్యావసరాలు, ఇతర సరుకులు సరఫరా అవుతాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆహార పదార్థాలు, ఔషధాల కొరత ఏర్పడే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి.
షిల్లాంగ్‌లో కర్ఫ్యూ ఎత్తివేత
షిల్లాంగ్‌లో నిరసనలు తగ్గుముఖం పట్టినందు వల్ల కర్ఫ్యూను శుక్రవారం ఉదయం 10గం. నుంచి 12 గంటల పాటు సడలించారు అధికారులు.
గువాహటిలో రోడ్లు బంద్..
అసోం గువహటిలో నిరసనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. కర్ఫ్యూ ఆంక్షలు లెక్కచేయకుండా ఆందోళనకారులు రోడ్లపైకి వస్తున్నారు. నిరసనలతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు విమానాశ్రయాలు, బస్ స్టేషన్లలో వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.
ఇదీ చూడండి: 'పౌర' సెగ: నిరసనకారులకు అసోం సీఎం తీవ్ర హెచ్చరిక