పార్లమెంటు స్థాయీ సంఘ సమావేశాల సమాచారం బయటకు రావడంపై లోకసభ స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటులో నివేదిక ప్రవేశపెట్టక ముందు ఏ విషయం బయటకు రాకుండా చూడాలని కోరుతూ అన్ని కమిటీల ఛైర్మన్లకు లేఖ రాశారు.
" పార్లమెంటరీ కమిటీల చర్చలు, విషయాలు గోప్యంగా ఉండాల్సిందే. కమిటీ నివేదికలు పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు సభ్యులు మీడియాకు చెప్పకూడదు. రూల్ 270 ప్రకారం.. సబ్జెక్టుల ఎంపిక సమయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా వ్యక్తి, పత్రం లేదా రికార్డును పరిశీలించే విషయంలో స్పీకర్ అభిప్రాయం తీసుకోవాలి. ఆ విషయాల్లో స్పీకర్ నిర్ణయమే శిరోధార్యం. సంప్రదాయం ప్రకారం.. కోర్టులలో పెండింగ్‌లో ఉన్న విషయాలను కమిటీలు చర్చకు తీసుకోవద్దు. భవిష్యత్‌లో జరగబోయే కమిటీల సమావేశాలలోనూ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి."
- ఓం బిర్లా, లోక్‌సభ స్పీకర్
ఫేస్‌బుక్ వివాదంతో..
ఫేస్‌బుక్ వివాదంపై ఆ సంస్థ అధికారులను ఐటీ కమిటీ ఛైర్మన్ శశి థరూర్ సమన్ చేయడంపై వివాదం చెలరేగింది. ఐటీ పార్లమెంటరీ కమిటీకి ఫేస్‌బుక్ అధికారులను పిలిపించిన వ్యవహారంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు భాజపా సభ్యులు నిషికాంత్ దుబే, రాజ్యవర్ధన్ రాఠోడ్. వారి ఫిర్యాదు మేరకు స్పందించారు స్పీకర్.
ఇదీ చూడండి: భారత్ వ్యూహం: దీవులతో చైనాకు దీటుగా..!