దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై లోక్సభ గళమెత్తింది. హైదరాబాద్ పశువైద్యురాలు దిశ సహా ఇటీవలి కాలంలో ఆడవారిపై జరుగుతున్న ఆకృత్యాలపై ఆవేదన వ్యక్తం చేశారు దిగువసభ ఎంపీలు.
నిర్భయ ఘటన అనంతరం చేపట్టిన చర్యలు విఫలమయ్యాయని.. అందుకు దేశంలో నెలకొన్న పరిస్థితులే ఉదాహరణని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ అన్నారు. మహిళలపై ఆకృత్యాలకు పాల్పడే వారిని తక్షణమే ఉరి తీసే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు.
"ఆ యువతి క్షేమసమాచారాల కోసం ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టోషన్ల చుట్టూ తిరిగారు. ఈ ఉదంతం... నిర్భయ ఘటనపై లోక్సభలో మనం జరిపిన చర్చలను గుర్తుకు తెస్తోంది. అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు విధించాలని సభ నిర్ణయించింది. కానీ ఎలాంటి లాభం లేదని తాజా ఘటనతో అర్థమవుతోంది. సభ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఈ ఘటన అనంతరం దేశప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలలను దృష్టిలో పెట్టుకుని.. అత్యాచారాలను తీవ్రమైన నేరాలుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. అత్యాచార నిందితులకు తక్షణమే ఉరిశిక్ష విధించేలా చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నా. ఉరి ఒక్కటే ఇలాంటి ఆకృత్యాలకు సరైన శిక్ష."
--- సౌగత్ రాయ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ.
కోయంబత్తూర్లో పాఠశాల విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనను గుర్తుచేశారు డీఎంకే ఎంపీ టీఆర్ బాలు. నిందితులకు తక్షణమే శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
బిజూ జనతాదళ్(బీజేడీ) ఎంపీ పినాకి మిశ్రా.. నిర్భయ హత్యాచార దోషులకు ఉరిశిక్ష అమలు చేయడంలో ఎందుకు ఆలస్యమవుతోందని కేంద్రాన్ని ప్రశ్నించారు.
మేము సిద్ధం...
అనంతరం రక్షణమంత్రి రాజ్నాథ్ స్పందించారు. దిశ హత్యాచార ఘటన దేశానికి సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టంలోని నిబంధనలు మార్చడంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు రక్షణమంత్రి.
మహిళలపై నేరాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేందుకు వీలుగా చట్టాన్ని రూపొందిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
"కేంద్రంలో బీపీఆర్ఎన్డీ(బ్యూరో ఆఫ్ పోలీస్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్) అనే విభాగం ఉంది. వారికి అన్ని బాధ్యతలు అప్పజెప్పాము. ఐపీసీ-సీఆర్పీసీలను సవరించే విధంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ కూడా రాశాము. న్యాయ, పోలీస్శాఖల నుంచి సలహాలు సేకరిస్తున్నాం. చట్టాలు రూపొందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డ్రాఫ్ట్ కుడా సిద్ధంగా ఉంది. వీటన్నిటినీ సత్వరమే సభ ముందుకు తీసుకురావడానికి అమిత్ షా ప్రణాళికలు చేస్తున్నారు. నిర్భయ ఘటనలో తల్లిదండ్రులకు కనీసం యువతి మృతదేహమైనా దక్కింది. హైదరాబాద్ ఘటనలో అది కూడా దక్కలేదు. ఇది ఎంతో భయానక ఘటన. దేశవ్యాప్తంగా ఇలా జరుగుతోంది. చట్టాలను సవరించి.. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని పార్టీలతో కలిసి ముందడుగు వేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది."
--- కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయమంత్రి.
ఇదీ చూడండి:- 'దిశ' హత్యాచారంపై రాజ్యసభలో విపక్షాల గళం