కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై పార్లమెంటు ఉభయసభల్లో పెను దుమారం రేగింది. మేక్ ఇన్ ఇండియా కాదు.. రేప్ ఇన్ ఇండియా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికార భాజపా సభ్యులు ఆందోళనకు దిగారు.
లోక్‌సభలో..
ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే.. భాజపా మహిళా సభ్యులు లేచి రాహుల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోడియం వద్దకు వచ్చి రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారికి పురుష ఎంపీలూ మద్దతు పలికారు. రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు.
"ఒక పార్టీకి చెందిన నేత.. భారతీయ మహిళలపై అత్యాచారం జరగాలని పిలుపు ఇచ్చారు. ఇలాంటిది జరగటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. గాంధీ పరివారంలోని ఒక వ్యక్తి దేశంలోని మొత్తం మహిళలపై బలత్కారం చేయాలని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ దేశ ప్రజలకు సందేశం ఇస్తున్నారు? రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలు చేసిన రాజకీయ నేతపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలి."
- స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి
మహిళా సభ్యుల ఆందోళనతో లోక్‌సభలో తీవ్ర గందరగోళం తలెత్తింది. ఫలితంగా సభను ఓసారి వాయిదా వేశారు స్పీకర్. తిరిగి సమావేశమయ్యాక.... రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. రాహుల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు. దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్న ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తులకు సభలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాహుల్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగగా... లోక్‌సభ మరోసారి వాయిదా పడింది. తిరిగి సమావేశమయ్యాక... శీతాకాల సమావేశాలు సాగిన తీరును స్పీకర్ ఓం బిర్లా వివరించారు. లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు
రాజ్యసభలో..
రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్యసభలోనూ అధికార భాజపా సభ్యులు ఆందోళనకు దిగారు. ఛైర్మన్ వెంకయ్యనాయుడు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. రాహుల్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ నేత క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో సభను ఒకసారి వాయిదా వేశారు వెంకయ్య.
ఝార్ఖండ్ ప్రచారంలో భాగంగా..
ఝార్ఖండ్ విధానసభ ఎన్నికల్లో భాగంగా ఈనెల 12న గొడ్డా ప్రాంతంలో నిర్వహించిన ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. 'ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా అని చెప్పారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఎక్కడ చూసినా రేప్ ఇన్ ఇండియాగా కనిపిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో మోదీకి చెందిన ఎమ్మెల్యే ఓ మహిళను అత్యాచారం చేశారు. ఆమె ప్రమాదానికి గురైంది. కానీ మోదీ ఒక్క మాటు కూడా మాట్లాడలేదు' అని విమర్శించారు రాహుల్.
ఇదీ చూడండి: యూకే ఫలితాలు: బోరిస్ దూకుడు.. బ్రెగ్జిట్‌కే బ్రిటన్ ఓటు!