పన్నుచెల్లింపుదారులకు.. పన్ను రిటర్న్‌లు, ఆధార్‌తో పాన్ అనుసంధానం గడువు పెంపు వంటి పలు ఉపశమన చర్యలను అమలు చేసేందుకు బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈ నేపథ్యంలో లోక్‌సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అది సభ పలుమార్లు వాయిదా పడేందుకు దారితీసింది.
ఈ బిల్లు మార్చిలో తీసుకొచ్చిన పన్నులు, ఇతర చట్టాలు(నియమాల్లో సడలింపులు, సవరణలు) ఆర్డినెన్స్ స్థానాన్ని భర్తీ చేయనుంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న వారికి సరైన అవగాహన లేదని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి. బిల్లు పూర్తిగా పన్ను రిటర్న్‌ల దాఖలు, పన్ను చెల్లింపుల కోసమని.. అది పూర్తిగా కేంద్రం పరిధిలోనిదిగా తెలిపారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ నిధులను కేంద్రం తప్పకుండా ఇస్తుందని భరోసా ఇచ్చారు. జీఎస్టీ మండలి నియమాలను కేంద్రం ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. పీఎం కేర్స్‌పై సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడతారని తెలిపారు.
అనంతరం అనురాగ్ ఠాకూర్ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రతి విషయంలో తప్పులు వెతికేందుకే ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఈవీఎం, ముమ్మారు తలాక్, జీఎస్టీపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. పీఎం కేర్స్‌లో ఎలాంటి తప్పు జరిగిందని ప్రశ్నించారు.
పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ ట్రస్ట్‌ను మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హయాంలో ఏర్పాటు చేస్తే.. ఇప్పటికీ అది పబ్లిక్ ట్రస్ట్‌గా రిజిస్టర్ కాలేదని, పీఎం రిలీఫ్ నిధిని కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందని విమర్శించారు. కానీ, పీఎం కేర్స్ నిధి రాజ్యాంగబద్ధంగా పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్‌గా నమోదు చేసినట్లు చెప్పారు. ఠాకూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. బిల్లును కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌదరి, శశి థరూర్, మనీశ్ తివారీ, టీఎంసీ నేత సౌగత రాయ్, సీపీఎం నేత ఏఎం అరీఫ్లు వ్యతిరేకించారు. కాగ్ ఆడిట్ నుంచి పీఎం కేర్స్‌ను ఎందుకు మినహాయించారని ప్రశ్నించారు. విపక్ష నేతల నిరసనలతో సభ నాలుగు సార్లు వాయిదా పడింది.