దేశమంతా కరోనాతో వణికిపోతుంటే ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు మాత్రం మిడతల దండు దాడితో గజగజలాడుతున్నాయి. రాజస్థాన్, పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్‌లలోని పంట పొలాలకు వీటి కారణంగా నష్టం వాటిల్లుతోంది.
తొలుత రాజస్థాన్‌లోకి ప్రవేశించిన ఈ ఏడారి మిడతలు క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చేరుకున్నాయి. దిల్లీకి కూడా ముప్పు పొంచి ఉంది. వీటి కారణంగా దేశంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
మిడతల బెడద విస్తరిస్తుండటం వల్ల కేంద్ర పర్యావరణ అటవీశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వాటి జాడను కనిపెట్టడానికి డ్రోన్లను వినియోగిస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌కూ..
రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతంలో తొలుత కనిపించిన మిడతలు ఇప్పుడు ఆ రాష్ట్ర రాజధాని జైపుర్‌కి పాకాయి. ఆ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో అత్యధికం ఇప్పుడు వీటి ప్రభావానికి లోనయ్యాయి. ఇవి మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాకూ విస్తరించగా అక్కడి అధికారులు రసాయనాలు పిచికారీ చేసి 60% మిడతలను మట్టుబెట్టారు.
వీటిని నియంత్రించకపోతే మధ్యప్రదేశ్‌లో సాగులో ఉన్న రూ.8వేల కోట్ల విలువైన పెసరపంట ధ్వంసమయ్యే ప్రమాదముంది. మిడతలు విస్తరిస్తూ పోతే మిరప, పత్తి చేలకూ తీవ్ర నష్టమని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోకి 2.5 నుంచి 3 చదరపు కి.మీ. పొడవున్న మిడతల దండు ప్రవేశించింది.
- ఒక చ.కి.మీ. పరిధిలోని మిడతల దండు ఒక రోజులో 35వేల మంది జనం తినేంత ఆహారాన్ని ఆరగిస్తాయి.