దేశవ్యాప్తంగా ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈసారి పలు సడలింపులు ఇస్తూనే లాక్‌డౌన్ కొనసాగించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. కంటైన్‌మెంట్ జోన్ల మినహా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, రాష్ట్రాల పరస్పర అంగీకారంతో వీటిని నడుపుకోవచ్చని హోంశాఖ స్పష్టం చేసింది.
లాక్‌డౌన్ 4.0 గైడ్ లైన్స్ ఇవే...
అనుమతి లేనివి..
- సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, హోటళ్లు మూసి ఉంటాయి.
- మెట్రో రైళ్లు, విద్యా, శిక్షణ సంస్థలు బంద్.
- దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్.
- స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, వినోద రెస్టారెంట్లు, ఆడిటోరియాలు
- పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే సభలకు అనుమతి లేదు.
- కంటైన్‌మెంట్ జోన్లలో బస్సు సర్వీసులకు అనుమతి లేదు.
- 65 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు, గర్భిణీలు ఇంటికే పరిమితం కావాలి
అనుమతి ఉన్నవి...
- దేశీయంగా మెడికల్ సేవలు, ఎయిర్ అంబులెన్స్‌లు, భద్రతకు సంబంధించిన వాహనాలకు అనుమతి.
- ప్రేక్షకులు లేకుండా క్రీడా కేంద్రాలు తెరిచేందుకు అనుమతి.
- వైద్య, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, హెల్త్‌కేర్ వర్కర్లలకు సేవలందించే, క్వారంటైన్‌లో ఉన్న పర్యటకులకు వసతి కల్పించే హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు అనుమతి ఉంటుంది.
- రెస్టారెంట్లు ఆహార పదార్థాలను హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతి.
- బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోని క్యాంటిన్లు నడిపేందుకు అనుమతి.
- రాష్ట్రాల పరస్పర అంగీకారంతో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి.
- షరతులు లేకుండా వైద్య సిబ్బంది అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి ఇవ్వాలి
కంటైన్మెంట్, బఫర్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు
- ఎక్కడెక్కడ రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు ఏర్పాటు చేయాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా వాటిని పరిగణించాల్సి ఉంటుంది.
- రెడ్, ఆరెంజ్, కంటైన్మెంట్, బఫర్ జోన్ల సరిహద్దులు ఆ జిల్లా అధికారులు నిర్ణయిస్తారు. అవి కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఉండాలి.
- కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు. ప్రజలు రోడ్లమీదకు రాకూడదు.
- కంటైన్మెంట్ జోన్లలో ప్రతి ఇంటిపైనా నిఘా ఉండాలి. అవసరమైన వైద్య పరీక్షలు, సేవలు అందించాలి.
రాత్రి కర్ఫ్యూ
రాత్రి 7గం. నుంచి ఉదయం 7గం. వరకూ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. (అత్యవసర సేవలు మినహా) ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేయాలి. అన్ని ప్రాంతాల్లోనూ 144వ సెక్షన్ అమలు చేయాలి.