కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలవుతోంది. ఈ తరుణంలో నిండు గర్భిణిగా ఉన్న కూతుర్ని చూసేందుకు ఆ తండ్రి సాహసమే చేశాడు. రెండు ఊర్ల మధ్య ఉన్న కాలువలో ఈత కొట్టుకుంటూ వెళ్లి చూసొస్తానని బయలు దేరి ప్రాణాలు కోల్పోయాడు.

అసలేం జరిగిందంటే...
తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని పల్లిపాలయానికి చెందిన పెరుమాళ్(60) కుమార్తె సుమతికి... హనూర్ మండలం పుదుర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ప్రస్తుతం ఆమె 9 నెలల గర్భిణి. కాన్పు సమయం కావడం వల్ల సుమతిని శనివారం మెట్టూరు ఆస్పత్రిలో చేర్చారు. కరోనా లాక్డౌన్ ఉన్నా పెరుమాళ్ ఎలాగైనా ఆమెను చూడాలని నిశ్చయించుకొన్నాడు. రెండు ఊర్ల మధ్య ఉన్న కాలువను ఈది ఆమె దగ్గరకు చేరుకోవాలని అనుకున్నాడు.
తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో మైసూర్-మెట్టూరు ప్రధాన రహదారికి 200 మీటర్ల సమీపంలో ఉంటుందీ కాలువ. గంటసేపు ఈత కొడితే తమిళనాడులోని కరేకాడు చేరుకోవచ్చు. కానీ... కొంత సమయం తర్వాత ఈత కొట్టలేక కాలువలో మునిగి చనిపోయాడు పెరుమాళ్. తమిళనాడులోని బరగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతడి మృతదేహం లభించింది.

ఇదీ చదవండి: ఫేస్బుక్ నుంచి త్వరలో ఉచిత గేమింగ్ యాప్!