ఒడిశా రూర్కెలాలో పోలీసులు, స్థానికుల మధ్య ఉద్రిక్తత చెలరేగింది. కంటైన్మెంట్ జోన్ ఎత్తేసే అంశమై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. శాంతించని నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ట్రక్కుల్లో స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఇదీ జరిగింది..
గత నెలలో రూర్కెలాలో తొలి వైరస్ కేసు నమోదైంది. అనంతరం పలువురికి వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో వైరస్ నివారణ చర్యల్లో భాగంగా.. ప్రాంతాలను కంటైన్మెంట్, బఫర్ జోన్లుగా ప్రకటించారు అధికారులు. కరోనా ఉద్ధృతి తగ్గిన కారణంగా ఇటీవల బఫర్ జోన్లలో ఆంక్షలను సడలించారు. అయితే కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయమే అక్కడ ఘర్షణకు కారణమైంది. తమ ప్రాంతాల్లోనూ సడలింపులు అమలు చేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు లక్ష్యంగా రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. అనంతరం నిరసనకారులను అదుపులోకి తీసుకుని ట్రక్కుల్లో తరలించారు.