బిహార్ ఎన్నికల్లో 'ఎల్జేపీ' అడుగు ఎటువైపు? - Bihar assembly polls
బిహార్ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ ఎటువైపు అడుగువేయనుంది. పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నట్లు కూటమిలోని జేడీయూపై తమ అభ్యర్థులను పోటీలో ఉంచటమా? లేదా.. కూటమితోనే సీట్లు పంచుకోవటమా? ఈ అంశంపై సోమవారం జరిగే ఎల్జేపీ సమావేశంలో తుది నిర్ణయం వెలువడనుంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చించేందుకు నేడు సమావేశం కానుంది లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ). ఎన్డీఏ కూటమిలోని జేడీయూకు వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలో దించాలా లేదా.., కూటమితోనే కొనసాగాలా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కూటమిలో లుకలుకలు..
ఎన్డీఏ వ్యతిరేక కూటమిలో ఉన్న మాజీ సీఎం జీతన్‌రాం మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చా.. జేడీయూతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించింది. దీనిని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యతిరేకిస్తోంది. మొదటి నుంచే జేడీయూతో అంటీముట్టనట్లు ఉండే ఆ పార్టీ ఇప్పడు ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులపై తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై సోమవారం జరగనున్న భేటీలో స్పష్టత రానుంది.
2005 వ్యూహంతోనేనా..
కొద్ది రోజులుగా సీఎం నితీశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు ఎల్జేపీ అధినేత చిరాగ్ పాసవాన్. కానీ, భాజపా, ప్రధాని మోదీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంలోనే ఉంటూ రాష్ట్రంలో జేడీయూకు వ్యతిరేకంగా తమ అభ్యర్థులను బరిలో దించాలని యోచిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇందుకు 2005 ఎన్నికల్లో ఎల్జేపీ అవలంబించిన తీరును పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2005 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో యూపీఏ భాగస్వామ్యంలోనే ఉంటూ రాష్ట్రంలో ఆర్జేడీకి వ్యతిరేకంగా పోటీ చేసింది. అది రాష్ట్రంలో హంగ్‌కు దారితీసింది. దాంతో లాలూ ప్రసాద్ పార్టీ 15 ఏళ్ల పాలనకు తెరపడింది.
కలిసే పోటీ..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కూటమిలోని మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు సీనియర్ నేతలు వెల్లడించారు.
నితీశ్ తీరుపై అసంతృప్తితోనే..
ఆర్జేడీ నుంచి నాయకులను ఆకర్షించటం, మాంఝీతో జతకట్టటం ద్వారా తన స్థానాన్ని సీఎం నితీశ్ బలోపేతం చేసుకునేందుకు కృషి చేయటం ఎల్జేపీ నేతలు అసౌకర్యంగా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీట్ల పంపకంపై ఎల్జేపీతో ఎలాంటి చర్చలు చేపట్టలేదని జేడీయూ వెల్లడించటం కూడా పాసవాన్ పార్టీ బయట నుంచి పోటీ చేసే అవకాశాలను బలపరుస్తోంది.
ఇదీ చూడండి: మాంఝీ ఎంట్రీ.. ఎన్డీఏలో లుకలుకలు!