గురువారానికి వాయిదా..
వ్యవసాయ చట్టాల రద్దుకు పట్టుబడుతూ విపక్షాలు చేస్తున్న ఆందోళనలతో లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కాగానే, కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధీర్ రంజన్ ఛౌదరి రైతుల ఆందోళన అంశాన్ని లేవనెత్తారు. అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ దెబ్బతింటుందన్నారు. ఇంతలో.. పలువురు సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు. వెనక్కు వెళ్లాలని స్పీకర్ ఓంబిర్లా పదే పదే సూచించినా... సభ్యులు నిరసనలు కొనసాగించారు.
దీంతో సభ 4.30 గంటలకు వాయిదా పడింది. మళ్లీ సభ ప్రారంభం కాగానే.. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగం, రైతుల అంశంపై ప్రత్యేకంగా చర్చ జరపాలని అధీర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. సభ్యులు మళ్లీ వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. వీరిలో కాంగ్రెస్, ఆప్, డీఎంకే, శిరోమణి అకాలీ దళ్ సభ్యులు ఉన్నారు. దీంతో సభ సాయంత్రం 5 గంటలకు.. ఆ తర్వాత సాయంత్రం 7 గంటల వరకు వాయిదా పడింది. ఏడు గంటలకు సమావేశం ప్రారంభమైనప్పటికీ.. ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించగా.. రాత్రి 9 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా ఆందోళనలు ఆగకపోవడం వల్ల సభాపతి సభను గురువారానికి వాయిదా వేశారు.